హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): కరోనా లాక్డౌన్ కారణంగా టీఎస్ఆర్టీసీ బస్ పాస్‌లను ఉపయోగించుకోని వారికి ఆ సంస్థ గ్రేటర్ హైదరాబాద్ జోన్ సదవకాశం కల్పిస్తోంది. టీఎస్ఆర్టీసీకి చెందిన ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్, గ్రేటర్ హైదరాబాద్, ఎయిర్పోర్ట్ పుష్పక్ ఏసీ బస్ పాస్ హోల్డర్లు లాక్డౌన్ కారణంగా కోల్పోయిన తమ బస్ పాస్‌ల వాలిడిటీని తిరిగి పొందవచ్చని, ఇందుకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన పనిలేదని టీఎస్ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయా బస్ పాస్ హోల్డర్ల పాస్‌ల కాలవ్యవధిని పెంచుతున్నామని తెలిపారు. ఇందుకుగాను పాస్ హోల్డర్లు తమ ఐడీ కార్డ్, టిక్కెట్లను బస్ పాస్ కౌంటర్లలో చూపించి పాస్‌లను మళ్లీ పొందవచ్చని సూచించారు. ఇందుకుగాను నవంబర్ 30వ తేదీ వరకు గడువు ఇచ్చినట్లు తెలిపారు. ఆలోగా తమ పాస్‌ల కాలవ్యవధిని హోల్డర్లు పొడిగించుకోవాల్సి ఉంటుందని తెలిపారు.