న‌కిలీ కాల్ సెంట‌ర్ నంబ‌ర్‌తో వ్య‌క్తికి కుచ్చు టోపీ

సైబ‌రాబాద్‌‌‌‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఓ న‌కిలీ క‌స్ట‌మ‌ర్ కేర్ స‌ర్వీస్ సెంట‌ర్ వ్య‌క్తి చేసిన మోసానికి మ‌రొక వ్య‌క్తి బ‌ల‌య్యాడు. సైబరాబాద్ పోలీస్ క‌మిష‌న‌రేట్ సైబ‌ర్ క్రైం పోలీసులు తెలిపిన ప్ర‌కారం ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాలు ఇలా ఉన్నాయి. న‌గ‌రంలోని దుందిగ‌ల్‌కు చెందిన ఎస్‌.రాజేష్ (పేరు మార్చ‌డం జ‌రిగింది) స్థానికంగా మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్ బిజినెస్ నిర్వ‌హిస్తున్నాడు. ఈ నెల 3వ తేదీన ఓ క‌స్ట‌మ‌ర్ అత‌ని వద్ద‌కు వ‌చ్చి న‌గ‌దు విత్‌డ్రా చేయాల‌ని కోరాడు. అయితే స‌ద‌రు ట్రాన్సాక్ష‌న్ ఫెయిలైంది. దీంతో రాజేష్ త‌న బిజినెస్‌కు చెందిన సాంకేతిక స‌హ‌కారం అందించే కంపెనీ క‌స్ట‌మ‌ర్ కేర్ ఫోన్ నంబ‌ర్ కోసం గూగుల్‌లో వెదికాడు. అందులో ఒక నంబ‌ర్ దొరికింది. దానికి కాల్ చేయ‌గా.. అవ‌త‌లి వ్య‌క్తి రాజేష్ కంప్యూట‌ర్‌లో ఎనీ డెస్క్ సాఫ్ట్ వేర్ ను ఇన్‌స్టాల్ చేయ‌మ‌న్నాడు. త‌రువాతి రోజు రాజేష్ త‌న బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.70వేలు త‌న‌కు తెలియకుండానే ట్రాన్స్‌ఫ‌ర్ అయిన‌ట్లు గుర్తించాడు. మ‌హ‌మ్మ‌ద్ ఇమ్రాన్ అనే వ్య‌క్తి అకౌంట్లోకి ఆ డ‌బ్బు బ‌దిలీ అయిన‌ట్లు అత‌నికి తెలిసింది. త‌న‌కు తెలియ‌కుండానే ఆ డ‌బ్బులు ట్రాన్స్‌ఫ‌ర్ అయినందున అత‌ను వెంట‌నే తాను మోస‌పోయాన‌ని గ్ర‌హించి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ఈ మేర‌కు పోలీసులు ఐటీ యాక్ట్ 2008 ప్ర‌కారం 420 సెక్ష‌న్ కింద కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ప్ర‌జ‌ల‌కు సైబ‌ర్ క్రైం పోలీసుల హెచ్చ‌రిక‌…

ప్ర‌జ‌లు తాము వాడే ఏదైనా స‌ర్వీస్ లేదా ఉత్ప‌త్తికి సంబంధించి క‌స్ట‌మ‌ర్ కేర్ నంబ‌ర్ కోసం గూగుల్‌లో వెద‌క‌కూడ‌ద‌ని, స‌ద‌రు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి ఆ నంబ‌ర్‌ల‌ను తెలుసుకోవాల‌ని సూచించారు. ప్ర‌స్తుత త‌రుణంలో క‌స్ట‌మ‌ర్ కేర్ అని చెప్పి చాలా మంది న‌కిలీ వ్య‌క్తులు చెలామ‌ణీ అవుతున్నార‌ని, వారు ప‌లు కంపెనీల‌కు చెందిన క‌స్ట‌మ‌ర్ కేర్ నంబ‌ర్లు అంటూ గూగుల్‌లో న‌కిలీ నంబ‌ర్ల‌ను అప్‌లోడ్ చేస్తున్నార‌ని, క‌నుక అలాంటి వ్య‌క్తులు, నంబ‌ర్ల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని అన్నారు. అలాగే కేవైసీ చేసుకోమ‌ని వ‌చ్చే కాల్స్ కు కూడా స్పందించ‌కూడ‌ద‌ని, ఇలాంటి మోసాలు ప్ర‌స్తుతం ఎక్కువ‌గా జ‌రుగుతున్నందున ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here