చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆరవ రోజు గురువారం వివిధ దేవాలయాల్లో అమ్మవారు పలు రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ ధర్మపురి క్షేత్రంలో, శాంతీనగర్ పోచమ్మ దేవాలయంలో, నెహ్రూ నగర్ రేణుక ఎల్లమ్మ దేవాలయాలలో అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరిదేవి అవతారంలో పూజలందుకున్నారు. భారతీయం సత్యవాణి లలితా సహస్ర నామాల యొక్క అర్థాన్ని, లలితా తత్వం గురించి భక్తులకు వివరించారు.
చందానగర్ లోని విశాఖ శ్రీ శారదాపీఠ పాలిత శిల్పా ఎంక్లేవ్ శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో, అన్నపూర్ణ ఎంక్లేవ్ సాయిబాబా దేవాలయాలలో అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవి అవతారంలో పూజలందుకున్నారు. కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. స్థానిక భక్తులు ప్రసాద్, శాంతి కుందరాజు, చందన, కృష్ణారావు, రమాదేవి, ఆదినారాయణ, సరితలు వివిధ సేవల్లో భాగస్వామ్యం అయ్యారు.
తారానగర్ లోని శ్రీ తుల్జాభవానీ ఆలయంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఆరవ రోజు శ్రీ సరస్వతీ దేవి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక హోమాలు నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన తల్లితండ్రులు వారి పిల్లలచే చదువుల తల్లికి ప్రత్యేక పూజలు చేయించారు.