చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని వేముకుంట శ్రీ లలితా పోచమ్మ దేవాలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆరవ రోజైన గురువారం అమ్మవారు శ్రీ సరస్వతీ దేవి అవతారంలో దర్శనమిచ్చారు. మాజీ కౌన్సిలర్, దేవాలయ ట్రస్టి గుఱ్ఱపు రవీందర్రావు కుటుంబ సభ్యులతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
గంగారం శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆరవ రోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అవతారంలో భక్తులకు కనువిందు చేశారు. పరిసర ప్రాంతాలకు చెందిన తల్లిదండ్రులు తమ పిల్లల చేత సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు రాజు, ప్రధాన కార్యదర్శి శ్రీశైలం యాదవ్, కమిటీ సభ్యులు శ్రవణ్ కుమార్, ఆర్ రవి కుమార్, నరసింహ, దినేష్, ఆలయ పండితులు పాల్గొన్నారు.