– అపార్ట్‌మెంట్ సెల్లార్లలో గంటల తరబడి కొనసాగుతున్న నీటి తోడకం
– మూడురోజులుగా నీట మునిగిన వాహనాలు గ్యారెజ్‌లకు తరలింపు
– జనావాసాల్లోకి చేరిన మురుగు – దుర్వాసనతో ప్రజలు సతమతం
– వీదులను శుభ్రం చేసే పనిలో నిమగ్నమైన పారిశుధ్య కార్మికులు
నమస్తే శేరిలింగంపల్లి: భారీ వర్షాల నేపథ్యంలో వరదలతో అతలాకుతలం ఐన శేరిలింగంపల్లి ముంపు ప్రాంతాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. జలమయమైన లోతట్టు ప్రాంతాల్లోంచి వరదనీరు కిందికి చేరుతుంది. ఆపార్ట్‌మెంట్ సెల్లార్‌లలోని నీటిని తోడేందుకు ప్రత్యేకంగా మోటార్లు ఏర్పాటు చేసి గంటల తరబడి నీటిని బయటకి తోడేస్తున్నారు. గండి పడిన చెరువుల్లోంచి పూర్తి స్థాయిలో దిగువకు చేరిపోవడంతో ముంపు ప్రాంతాల ప్రజలు ఊపిరి పిల్చుకుంటున్నారు. ఐతే వరద ఉదృతిలో నాలాల్లో పేరుకుపోయిన చెత్త, చెదారం, మురుగు జనావాసాల మధ్యలోకి కొట్టుకురావడంతో ఆయా ప్రాంతాల ప్రజలు దుర్వాసనతో అవస్థలు పడుతున్నారు. కాగా జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు వీదులను శుభ్రం చేసే పనిలో మునిపోయారు. రెండు మూడు రోజులుగా వరద నీటిలో మునిగి ఉన్న బైక్‌లు, కార్లు ఇప్పుడిప్పుడే గ్యారేజ్‌లకు చేరుతున్నాయి.
వరద గోదారిని తలపిస్తున్న లింగంపల్లి రైల్వే అండర్‌బ్రిడ్జీ
లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జీ కింద శుక్రవారం సైతం వరద నీరు పారుతునే ఉంది. గొపి చెరువు అలుగు గండి పడటంతో భారీ పల్లానికి భారీ ఎత్తున వరదనీటి ప్రవాహం కొనసాగుతుంది. ఈ క్రమంలో లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జీ ఇంకా 60 శాతం నీటిలోనే మునిగి ఉంది. దీంతో బ్రిడ్జీకి ఒక వైపు పాపిరెడ్డి కాలనీ, సురభి కాలనీ, రాజీవ్ స్వగృహ, రాజీవ్ గృహకల్ప వెళ్లేందుకు ఉన్న ఏకైక మార్గంలో వాహనాల రాకపోకలు నాలుగు రోజులుగా పూర్తిగా స్థభించిపోయాయి. అవతలి వైపు వాహనదారులు మాత్రం ప్రత్యామ్నాయంగా నల్లగండ్ల రైల్వే ఓవర్ బ్రిడ్జీని ఉపయోగిస్తున్నారు.
లోతట్టు ప్రాంతాల్లోని వ్యాపారులకు తీవ్ర నష్టం
వరద ఉదృతి నేపథ్యంలో లింగంపల్లి, తారానగర్ ప్రాంతాల్లోని వ్యాపార సముదాయాలు నీటమునిగాయి. దీంతో ఆయా వ్యాపారులకు పెద్ద మొత్తంలో ఆస్తినష్టం తలెత్తింది. లింగంపల్లి చౌరస్థాలోని మహదేవ్ ఫర్నీచర్ షోరూం పూర్తిగా నీటిలో మునిగిపోయిందని, అందులో దాదాపు రూ.70 లక్షల ఫర్నీచర్ ఉందని, హుడా ట్రేడ్ సెంటర్‌లోని గోడౌన్‌ను ఇప్పటికి తెరిచే పరిస్థితి లేదని రెండుచోట్ల కలిపి మొత్తం రూ. కోటిపైన ఆస్థినష్టం తలెత్తిందని యజమాని మురళీ కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అనేక మంది వ్యాపారులు తమ సరుకు మొత్తం నీటిపాలయ్యిందని కన్నీరు మున్నీరవుతున్నారు.
లోతట్టు ప్రాంతాలలో ప్రజా ప్రతినిధుల పర్యటనలు
గచ్చిబౌలి డివిజన్ డైమండ్ హైట్స్‌లో స్థానిక కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, జోనల్ కమిషనర్ రవికిరణ్, జీహెచ్ఎంసీ అధికారులతో, శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని వెంకట్‌రెడ్డి కాలనీ, గోపిచెరువు, రైల్వే అండర్ బ్రిడ్జీ ప్రాంతాలను స్థానిక డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్ష కార్యదర్శులు రాజుయాదవ్, చింతకింది రవిందర్ గౌడ్‌లతో కలసి ప్రభుత్వ విప్ గాంధీ పరిశీలించారు. తారానగర్, నల్లగండ్ల కురగాయల మార్కెట్, బాపునగర్ ప్రాంతాల్లోని ముంపు సమస్యను స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు. చందానగర్ డివిజన్ శంకర్ నగర్ కాలనీ,వేమన రెడ్టీ కాలనీ, కైలాష్ నగర్, జవహర్ కాలనీ లలో రోడ్ల పై పేరుకుపోయిన బురద, మట్టిని స్థానిక కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి శుభ్రం చేయించారు. హఫీజ్ పెట్ డివిజన్ జనప్రియ, రామకృష్ణ నగర్, మదీనగూడ మెయిన్ రోడ్డులో ముంపు ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ వి.పూజితా జగదీశ్వర్ గౌడ్ పర్యటించి తాజా పరిస్థితులపై ఆరి బాదితులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఆల్విన్ కాలనీ డివిజన్ రాఘవేంద్ర కాలనీలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ముంపు ప్రాంతాలను పరిశీలించారు.