నమస్తే శేరిలింగంపల్లి: తన ఇంట్లో డబ్బులు పోయాయని కాలుతో గొంతుమీద తన్నడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మియాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇస్లావత్ మున్నా అలియాస్ రమేష్ అనే వ్యక్తి లేబర్ పని చేసుకుంటూ న్యూ హఫీజ్ పేట మార్తాండ నగర్ లో నివాసం ఉంటున్నారు. శ్రీను అనే వ్యక్తి ఇంట్లో రూ. 5 వేలు పోయాయని రమేష్ పై అనుమానం వ్యక్తం చేస్తూ ఈ నెల 14న రాత్రి 9 గంటల సమయంలో దాడి చేశాడు. శ్రీను రమేష్ గొంతుపై కాలుతో తన్ని కొట్టడంతో గాయాలకు గురయ్యాడు. గాయాలకు గురై కిందపడిపోయిన రమేష్ ను భార్య శాంతి కొండాపూర్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. రాత్రి 11 గంటల సమయంలో రమేష్ మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు మియాపూర్ పోలీసులు చెప్పారు.






