ప్రపంచంలోనే మెడికవర్ వైద్యుల అరుదైన వైద్య చికిత్స – అన్నవాహిక ఆంత్రమూలం స్టంట్ తో జీర్ణాశయ సమస్యకు చెక్

నమస్తే శేరిలింగంపల్లి: ప్రపంచంలోనే అరుదైన వైద్య చికిత్స చేసి మెడికవర్ ఆస్పత్రి వైద్యులు మరోసారి ఘనత సాధించారు. అన్నవాహిక ఆంత్రమూలం (ఈసోఫాగోడ్యుయోడెనాల్‌) స్టంట్‌ ద్వారా జీర్ణాశయ లోపం సరిదిద్ది ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడారు. డాక్టర్‌ ప్రణీత్‌ మోకా ఈ శస్త్ర చికిత్స కు సంబంధించి వివరాలను వెల్లడించారు. అత్యంత అరుదైన వైద్య స్థితితో ఇబ్బంది పడుతున్న యెమన్‌కు చెందిన 35 సంవత్సరాల వ్యక్తి ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన ఓ దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అతని కడుపులో కుడి వైపు నుంచి బుల్లెట్లు దూసుకుపోయాయి. అదే రోజు యెమన్‌లో అతనికి శస్త్రచికిత్స చేసి బుల్లెట్లు తొలగించడంతో పాటుగా కడుపులో చేరే స్రవాలు బయటకు పోయేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు కూడా చేశారు. తీవ్ర రక్తస్రావం కావడంతో 11 యూనిట్ల రక్తం అతనికి ఎక్కించి అతని ప్రాణాలను ఆ సమయంలో‌ కాపాడారు. అనంతరం నిర్వహించిన సీటీ పరీక్షలలో అతని కడుపులో ఎడమ సబ్‌ ఫ్రెనిక్‌, పెరి గ్యాస్ట్రిక్‌ ప్రాంతంలో కొంత మొత్తంలో చెడు స్రావాలు నిల్వ ఉన్నట్లుగా గమనించారు. ఈ సమస్యలను పోగొట్టడంతో పాటు అధికంగా చేరుతున్న స్రవాలను అడ్డుకునేందుకు మరలా ల్యాప్రోటమీ చేశారు. అయినప్పటికీ మరలా సమస్యలు ఎదురుకావడం, పాత సమస్య తిరగబెట్టడంతో అక్కడి డాక్టర్లు నిస్సహాయతను వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితుల్లో ఆ రోగి ఏప్రిల్‌ 23వ తేదీన భారతదేశానికి తాను నోటి ద్వారా తీసుకున్న ఆహారం ఎడమవైపు ఛాతీ దిగువభాగంలో ఉన్న గాయం నుంచి బయటకు వస్తుందని, అలాగే కడుపుపై భాగంలో ఉన్న గాయం నుంచి కూడా బయటకు వస్తుందంటూ వచ్చారు. మెడికవర్‌ హాస్పిటల్స్‌లోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీలో కన్సల్టెంట్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ , హెపటాలజిస్ట్‌గా సేవలనందిస్తున్న తాను ఈ రోగి స్థితిని నిశితంగా గమనించినట్లు డాక్టర్ మోకా‌ తెలిపారు. ఈ రోగికి రక్తపోటు తగ్గడంతో పాటు శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బంది పడుతున్నాడని, దీనికి తోడు అతని కడుపులో అయిన గాయాల కారణంగా వ్యర్థ స్రావాలు కూడా అధికంగా ఉత్పత్తి అవుతున్నట్లుగా గుర్తించినట్లు తెలిపారు. మరలా శస్త్ర చికిత్స చేస్తే తట్టుకునే స్ధితిలో రోగి లేకపోవడం చేత ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయాలని ప్రణాళిక చేశామన్నారు. గ్యాస్ట్రిక్‌ లీక్‌ అనేది అత్యంత అరుదైన సమస్య అన్నారు. ల్యాప్రోస్కోపిక్‌ స్లీవ్‌ గ్యాస్ట్రెక్టోమీ తరువాత 0.5–3% రోగులలో ఇది కనిపిస్తుందని, ఈ రోగి నోటి ద్వారా ఆహారం తీసుకోవడం మానేశాడన్నారు. ఇలాంటి స్థితిలో శస్త్రచికిత్స కంటే ఎండోస్కోపీ స్టెంటింగ్‌ విధానం చికిత్సతో ప్రమాదం తక్కువగా ఉండి ఫలితాలు మెరుగ్గా ఉండే అవకాశాలుండడంతో విధానాన్ని అనుసరించామని తెలిపారు.

వైద్య చికిత్స విధానాన్ని వివరిస్తున్న మెడికవర్ వైద్యులు

రెండుసార్లు ఈ విధానంతో చికిత్సనందించడం ద్వారా రోగి జీర్ణకోశ, అన్నవాహికలలో సమస్యలకు స్టెంటింగ్‌తో తగిన పరిష్కారం దక్కిందన్నారు. రోగి ఆరోగ్య స్థితి కాస్త మెరుగుపడిన తరువాత నోటి ద్వారా ఆహారం తీసుకోవచ్చని, ఇప్పుడు అతని స్థితి పూర్తిగా మెరుగుపడిందన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చేసిన ఈసోఫాగోడ్యుయోడెనాల్‌ స్టెంటింగ్‌ (బేరియాట్రిక్‌ స్టెంటింగ్‌కు వెలుపల) కేసు ఇది అని అన్నారు. ఈ రోగికి చికిత్స అందించిన బృందంలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ రేడియో డయాగ్నోసిస్‌ హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్‌ డాక్టర్‌ విజయ్‌కుమార్‌ ఎల్‌, సీనియర్‌ జనరల్‌ సర్జన్‌ డాక్టర్‌ శరత్‌ కుమార్‌ రెడ్డి ఉన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here