నమస్తే శేరిలింగంపల్లి: సర్వజీవకోటి మనుగడకు గాలి తర్వాత జలమే అత్యవసరమైన ప్రకృతి వనరు అని మెట్రో వాటర్ వర్క్స్ జనరల్ మేనేజర్ యస్ రాజశేఖర్ అన్నారు. ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నీటి యొక్క ప్రాముఖ్యత, ప్రకృతి ప్రసాదించిన నీటి వనరులను కలుషితం కాకుండా కాపాడుకోవడానికి, నీటిని పొదుపుగా వాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రూపొందించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర గ్రహాలకు భిన్నంగా, భూగోళం పై సర్వజీవకోటి వృద్ధి చెందడానికి నీరే ప్రధాన కారణమన్నారు. భూగోళం మీద ఉన్న నీటి వనరుల్లో 99 శాతం ఉప్పు నీరే, ఇందులో 97 శాతం సముద్రాలలో ఉండగా మిగతావి నదులు, చెరువుల్లో ఉన్నాయన్నారు. త్రాగడానికి ఉపయోగపడే జలాలు ఒక శాతం మాత్రమే అని ఇందులో 0.86 శాతం చెరువులు, నదుల్లో 0.02 శాతం, 0.12 శాతం భూగర్భ జలాలు అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 0.3 శాతం నీరు వినియోగించడం జరుగుతుందని చెప్పారు. జీవ వైవిధ్యం, జీవ రక్షణ నీటితోనే సాధ్యమవుతుందని చెప్పారు. ఐక్యరాజ్యసమితి మార్చి 22న ప్రపంచ జల దినోత్సవం నిర్వహించాలని సూచించారు. ప్రకృతి ప్రసాదించిన నీటి వనరులను భవిష్యత్తు తరాలకు పరిశుభ్రమైన నీరు అందించవలసిన సామాజిక బాధ్యత అందరిపై ఉందంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో బీవీ రమణగౌడ్, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు గంగాధర్, శివరామకృష్ణ, పాలం శ్రీను, జనార్థన్, నాగేశ్వరావు, అశోక్, బాలన్న తదితరులు పాల్గొన్నారు.