నమస్తే శేరిలింగంపల్లి: చాక్లెట్ కొనుక్కోవడానికి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఏడేళ్ల బాలుడు సెప్టిక్ ట్యాంకులో శవమై తేలాడు. ఈ సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. చందానగర్ ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శేరిలింగంపల్లి డివిజన్ పాపిరెడ్డి కాలనీ రాజీవ్ గృహకల్ప బ్లాక్ నం 35 ప్లాట్ నం 28 లో రాజు, రాథోడ్ అన్నూబాయ్ దంపతులు నివాసం ఉంటున్నారు. రాజు హౌస్ హోల్డ్ వర్క్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరి కుమారుడు అరవింద్ (7) మంగళవారం సాయంత్రం చాక్లెట్ కొనుక్కుని వస్తానని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టు పక్కలంతా వెతికినా ఫలితం లేకపోవడంతో చందానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీఐ క్యాస్ట్రో రెడ్డి, పోలీస్ సిబ్బందితో కలిసి అర్థరాత్రి వరకూ పాపిరెడ్డి కాలనీ, రాజీవ్ గృహకల్ప చుట్టు పక్కల ప్రాంతాలన్నీ గాలించినా ఆచూకీ లభించలేదు. బుధవారం ఉదయం పక్కనే ఉన్న పెద్ద సెప్టిక్ ట్యాంకు(సంపు)లో బాలుడి మృతదేహం పైకి తేలి కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మంగళవారం సాయంత్రం సెప్టిక్ ట్యాంకు సమీపంలో ఆడుతూ ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంకులో పడిపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది. సంపులో నుంచి బాలుడి మృతదేహాన్ని బయటకు తీయడంతో తల్లిదండ్రుల రోధనలు మిన్నంటాయి.
కార్పొరేటర్ రాగం రూ. 20 వేల ఆర్థిక సహాయం…
సెప్టిక్ ట్యాంకులో పడి బాలుడు మృతిచెందాడన్న విషయం తెలుసుకున్న శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సంఘటనా స్థలానికి వెళ్లారు. మృతుని కుటుంబాన్ని ఓదార్చారు. మృతిని కుటుంబానికి రూ. 20 వేల ఆర్థిక సహాయం అందజేశారు.