నమస్తే శేరిలింగంపల్లి: కేసినో తరహాలో పోకర్ ఆటను నడుపుతున్న ఓ నిర్వాహకుడితో పాటు 12 మంది జూదగాళ్లను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్దనుండి దాదాపు 1.8 కోట్ల విలువైన సొత్తును సీజ్ చేసిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… మణికొండ సీబీఆర్ రెసిడెన్సీ కి చెందిన సిజే.నీరజ్ కుమార్(33) కేజీఎన్ మణికొండ సమీపంలోని ప్రిస్టీన్ కమ్యూన్ లో 401 ఫ్లాట్ ను అద్దెకు తీసుకున్నాడు. సదరు ఫ్లాట్ లో పోకర్ ఆట నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసి కేసినో తరహాలో నగదును బదులుగా చిప్స్ అందించి ఎంచుకున్న రోజులలో రాత్రి వేళల్లో ఆటలు నిర్వహించసాగాడు. ఎప్పుడు వచ్చే ఆటగాళ్లు, వారి పరిచయస్తులతోనే పోకర్ ఆటను పెద్దమొత్తంలో డబ్బుతో నిర్వహించసాగాడు. ఆటలో ఉపయోగించే చిప్స్ కు సరిపోయే నగదును ఆన్లైన్ లో బదిలీ చేయసాగాడు. కనీస పందెం రూ.25 వేలు మొదలు లక్షల్లో పందేలు కాయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారంతో సదరు ఫ్లాట్ పై దాడి చేసిన మాదాపూర్ జోన్ ఎస్ఓటి పోలీసులు నిర్వాహకుడు నీరజ్ తో పాటు ధ్రువ, జగన్నాధ రాజేష్, సిజే రమణ, దొంతలూరి రాజశేఖర్, మిట్టపల్లి పవన్ కుమార్, చిక్కుడు సాయి కృష్ణ, గడ్డమోమి సంతోష్, రాహుల్ చౌహన్, హోసూర్ రఘు, అలిక్ హిరాని, సిజే.కార్తిక్, వివిఎన్ శ్రీకాంత్ లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ.8600 నగదు తో పాటు బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ.90,34,569 నగదు, 6 వాహనాలు, 19 మొబైల్ ఫోన్లు, పోకర్ టేబుల్, ప్లేయింగ్ కార్డులు మొత్తం దాదాపు రూ.1.80 కోట్ల విలువైన సొత్తును సీజ్ చేశారు. ఈ మేరకు గేమింగ్ యాక్ట్ ద్వారా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.