కరెన్సీ కట్టలు కొల్లగొట్టేందుకు వచ్చి కంప్యూటర్లు పట్టుకెళ్లారు-సైబ‌రాబాద్ క‌మిష‌న‌రేట్ ప్రక్క భవనంలో ఘటన

  • రాయదుర్గం సెంట్రల్ బ్యాంకులో దోపిడీకి విఫలయత్నం
  • ఆల‌స్యంగా వెలుగు చూసిన వైనం – విచార‌ణ‌లో నిమ‌గ్న‌మైన పోలీసులు

నమస్తే శేరిలింగంపల్లి: బ్యాంకును కొల్లగట్టాలని పక్కా స్కెచ్ వేశారు. రెక్కీ నిర్వహించి మరీ బ్యాంకు లోకి చొరబడ్డారు. పక్కనే పోలీస్ బాస్ కార్యాలయం ఉన్నా డోంట్ కేర్ అనుకున్నారు. అంతా అనుకున్నట్లు జరిగినా స్ట్రాంగ్ రూమ్ తెరచుకోకపోవడంతో కంప్యూటర్ మానిటర్లు ఎత్తుకెళ్లి పోయారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే…

తెల్లవారు ఝామున 2:22 గంటల సమయంలో బ్యాంకు ఆవరణలో దుండగులు.

గచ్చిబౌలిలో సైబరాబాద్ కమీషనర్ కార్యాలయం ప్రక్క భవనంలో సెంట్రల్ బ్యాంక్ రాయదుర్గం శాఖ ఉంది. బుధవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు బ్యాంకు సిసి కెమెరా ధ్వంసం చేసి కిటికీ గ్రిల్స్ తొలగించి బ్యాంకులోకి ప్రవేశించారు. అలారం మోగకుండా తీగలను కట్ చేశారు. స్ట్రాంగ్‌ రూంను తెరిచేందుకు ప్రయత్నించినప్పటికీ అది ఎంతకూ తెరచుకోకపోవడం తో బ్యాంక్ లోని ఆరు మానిటర్లు, సీసీటీవీ డీవీఆర్‌, ప్రింటర్ ను ఎత్తుకెళ్లారు. ఎప్పటిలాగే బుధవారం సిబ్బంది బ్యాంకు తెరచిన అనంతరం మానిటర్లు కనిపించకపోవడంతో పాటు కిటికీ గ్రిల్స్ తొలగించి ఉండటం, ఫాల్స్ సీలింగ్‌ కు రంధ్రం ఉండటాన్ని గమనించి బ్రాంచి మేనేజర్‌కు సమాచారం అందించారు. మేనేజర్ ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దోపిడీ ఘటనకు సంబంధించి వివరాలు సేకరించారు. క్లూస్‌ టీం ఘటనకు సంబంధించిన ఆధారాలు సేకరించారు.

ఉదయం 5:08 గంటల సమయంలో ట్రాలీ ఆటోలోకి బ్యాగులను మోసుకెళ్తున్న మహిళ

దోపిడీకి ముందే నిందితులు రెక్కీ నిర్వహించినట్లు పోలీసులు భావిస్తున్నారు. సిసి కెమెరాలను తొలగించడం, అలారం తీగలు కత్తిరించడం, సిసి ఫుటేజ్ దొరకకుండా డివిఆర్ ఎత్తుకెళ్లడం అంతా పథకం ప్రకారమే జరిగినట్లు తెలుస్తోంది. బ్యాంకు ఉన్న భవనంలో మరో సీసీ కెమెరాలో మాత్రం దుండగుల కదలికలు రికార్డయ్యాయి. బుధవారం తెల్లవారు జామున 2.22 గంటలకు ప్రధాన రహదారి అవతలి నుంచి రోడ్డు దాటి బ్యాంకు వైపు వచ్చిన ఓ వ్యక్తి, ముఖానికి నిండుగా నల్లటి స్కార్ఫ్ కట్టుకున్న ఓ మహిళ ఇద్దరూ కలిసి ఈ సెంట్రల్ బ్యాంక్ ఉన్న మొదటి అంతస్తుకు వెళ్లడం సిసి కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది. ఉదయం 5.07 గంటలకు ఓ వ్యక్తి ట్రాలీ ఆటోను తీసుకురాగా కవరల్లో ప్యాక్ చేసిన వస్తువులను ఆటోలో పెట్టుకొని అక్కడి నుంచి ఇద్దరూ వెళ్లిపోయారు. సుమారు రెండున్నర గంటలకు పైగా దుండగులు బ్యాంక్ లోనే ఉన్నట్లు తెలుస్తోంది. కమీషనర్ కార్యాలయం ప్రక్కనే బ్యాంకు దోపిడీ జరగడం, కేవలం ఇద్దరు వ్యక్తులే దోపిడీకి యత్నించడం పోలీసులకు పెను సవాలుగా మారింది. కేసు సీరియస్ గా తీసుకున్న పోలీసులు సమీపంలోని మరిన్ని సిసి కెమెరాల్లో ఫుటేజ్ పరిశీలించి నిందితుల ఆచూకి కోసం ప్రయత్నిస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here