నమస్తే శేరిలింగంపల్లి: ప్రజా కవి, ప్రత్యేక రీతిలో కవితలు రాసి సామాజికంగా, రాజకీయంగా ప్రజలను ప్రేరేపించిన కాళోజీ నారాయణ రావు జయంతి వేడుకలను అధికారికంగా జరుపుకోవడం గర్వకారణమని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. కాళోజీ 107 వ జయంతిని పురస్కరించుకుని సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో కాళోజీ చిత్ర పటానికి సీపీ స్టీఫెన్ రవీంద్ర పూలమాల వేసి నివాళి అర్పించారు. కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకోవడం గొప్ప కవికి నివాళి అని అన్నారు. ప్రజల కవిగా ప్రసిద్ధి చెందిన కాళోజీ నారాయణరావు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంతో సహా అనేక ఉద్యమాలలో పాల్గొన్నారని, రాష్ట్ర ప్రభుత్వం కాళోజీ జయంతిని అధికారికంగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం స్థాపించడానికి కాళోజీ తీవ్రంగా శ్రమించారని పేర్కొన్నారు. కాళోజీని గొప్ప మానవతావాది, తెలంగాణ వేమనగా పిలుస్తారని, నేటి తరం యువతకు స్ఫూర్తిగా నిలిచిన గొప్ప కవి అన్నారు. శంషాబాద్ డీసీపీ ఎన్ ప్రకాష్ రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ ఎస్ ఎం విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.