నమస్తే శేరిలింగంపల్లి: ఆడుకుంటూ ప్రమాదవశాత్తు షో రూమ్ షట్టర్‌లో ఇరుక్కుని బాలుడు మృతి చెందిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్‌పెక్టర్ రాజగోపాల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. తూ.గో.జిల్లాకు చెందిన గుత్తుల అర్జున్ కుమార్ భార్య దేవి, ఇద్దరు కుమారులతో బ్రతుకుదెరువు కోసం నగరానికి వలసవచ్చాడు. గచ్చిబౌలి అంజయ్యనగర్‌లో టివియస్ షోరూం ఉన్న కె.ఎన్.ఆర్ స్క్వేర్ భవనంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. కాగా బుధవారం ఉదయం అర్జున్ చిన్న కుమారుడు రాజేష్(11) పై అంతస్థులో ఆడుకోవడానికి వెళ్లి తిరిగి రాలేదు. అనుమానంతో పైకి వెళ్లి చూడగా టివియస్ షోరూం షట్టర్‌లో ఇరుక్కుని వేలాడుతూ కనిపించాడు. కిందికి దించి చూడగా తీవ్రగాయాల కారణంగా అప్పటికే మృతి చెందాడు. షోరూం కు గల ఆటోమేటిక్ షట్టర్ తెరచుకున్న కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. తండ్రి అర్జున్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.