శేరిలింగంపల్లి, అక్టోబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): దేశ రక్షణ, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేశ్ పిలుపునిచ్చారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద ఆయన ఘనంగా నివాళులర్పించారు. ముందుగా గౌరవ వందనాన్ని స్వీకరించి అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సీపీ డా. ఎం. రమేశ్ మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు మరణం లేదని, వారి త్యాగాలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. సరిహద్దుల్లో సైనికుల పోరాటం, సమాజంలో పోలీసుల ధైర్యసాహసాలు దేశ భద్రతకు రెండు బలమైన స్తంభాలని అభివర్ణించారు. యూనిఫాం ధరించడం గౌరవమైతే, దాని గౌరవాన్ని కాపాడడం బాధ్యతని, దేశం కోసం ప్రాణత్యాగం చేయడం అత్యున్నత త్యాగమని అన్నారు.

అమరవీరుల త్యాగాలు చరిత్రగా, వారి ధైర్యసాహసాలు స్ఫూర్తిగా, దేశభక్తి భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని చెప్పారు. దేశం కోసం పోరాడిన వీరులను గౌరవించాలని, ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకోవడంతోపాటు వారి కుటుంబాలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. దేశ ఐక్యత, సమగ్రతను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యతని స్పష్టం చేశారు. ప్రజల రక్షణ కోసం నిరంతరం పనిచేసే పోలీసులకు ప్రజలు సహకరించాలని సీపీ కోరారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహణ వెనుక ప్రధాన ఉద్దేశం.. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాలను గుర్తుచేసుకోవడంతోపాటు, భవిష్యత్తులో పోలీస్ శాఖలో బాధ్యతలు చేపట్టబోయే వారిలో స్ఫూర్తి, నూతనోత్సాహాన్ని నింపడమేనని తెలిపారు. ప్రతి పోలీసు క్రమశిక్షణతో, అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు.

ఈ ఏడాది దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో దాదాపు 154 మంది పోలీసులు అమరులయ్యారని పేర్కొంటూ వారికి జోహార్లు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోలీసుల మరణం వారి కుటుంబాలకు తీరని లోటని, అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది ఫహీముద్దీన్, కె. హన్మంత్ రెడ్డి, టి. ఈశ్వర్ రావు కుటుంబ సభ్యులను సీపీ శాలువాలతో సత్కరించారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం అమరులైన పోలీసుల సేవలు, త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు. ప్రజలకు 24 గంటలూ అందుబాటులో ఉండే పోలీస్ శాఖకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని కోరారు.

దేశంలో ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని అణచివేసి శాంతిభద్రతలను కాపాడేందుకు ఎంతోమంది పోలీసులు ప్రాణత్యాగాలు చేశారని సీపీ గుర్తుచేశారు. 1959 అక్టోబర్ 21న లడఖ్ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న పది మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చైనా సైన్యంతో వీరోచితంగా పోరాడుతూ ప్రాణాలు అర్పించారని తెలిపారు. వారి త్యాగాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. అనంతరం పోలీస్ అమరవీరుల గౌరవార్థం రెండు నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అధికారులు, సిబ్బంది ఒక్కొక్కరుగా అమరవీరుల స్మారక స్థూపం వద్దకు వెళ్లి నివాళులర్పించారు. ఈ ఏడాది అమరులైన పోలీసుల పేర్లతో కూడిన రోల్ ఆఫ్ హానర్‌ను సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ డీసీపీ సంజీవ్ చదివి వినిపించారు.
అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పోలీస్ సిబ్బంది రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో సీపీ డా. ఎం. రమేశ్‌తోపాటు పలువురు అధికారులు, సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. రెడ్‌క్రాస్ సంస్థకు 87 యూనిట్లు, ఎన్టీఆర్ ట్రస్ట్‌కు 73 యూనిట్లు కలిపి మొత్తం 160 యూనిట్ల రక్తాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ అన్నపూర్ణ, కూకట్పల్లి డీసీపీ రితీరాజ్, క్రైమ్స్ డీసీపీ పుష్ప, శేరిలింగంపల్లి డీసీపీ చింతమనేని శ్రీనివాస్, కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి, వుమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన, సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ డీసీపీ సంజీవ్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు, హెడ్‌క్వార్టర్స్ సిబ్బంది, లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్లు, ట్రాఫిక్ సిబ్బంది, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.





