శేరిలింగంపల్లి, అక్టోబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణకు చెందిన బీజేపీ నాయకురాలు, చందానగర్ మాజీ కార్పొరేటర్ అభ్యర్థి కసిరెడ్డి సింధూ రెడ్డికి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో కీలక బాధ్యత లభించింది. బీజేపీ యువమోర్చా (బీజేవైఎం) జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఆమె నియమితులయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన యువ నాయకులకు బీజేవైఎం జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించగా, తెలంగాణ నుంచి సింధూ రెడ్డికి అవకాశం దక్కింది. హైదరాబాద్‌లోని చందానగర్ ప్రాంతం నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆమెకు జాతీయ స్థాయిలో బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా నియమితులైన నేపథ్యంలో సింధూ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. చందానగర్ నుంచి జాతీయ స్థాయి బాధ్యత వరకు తనకు అవకాశం కల్పించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నియామకాన్ని పదవిగా కాకుండా బాధ్యతగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బీఎల్ సంతోష్, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, బీజేవైఎం జాతీయ ఇన్‌ఛార్జి హరీశ్ ద్వివేది, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ హేమాంగ్ జోషి తదితరులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
దేశ యువత అభ్యున్నతికి, వికసిత భారత్-2047 లక్ష్య సాధనకు పార్టీ కార్యకర్తలతో కలిసి కృషి చేస్తానని సింధూ రెడ్డి తన సందేశంలో పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో లభించిన ఈ బాధ్యతతో తెలంగాణ యువ నాయకత్వానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కిందని ఆమె తెలిపారు.





