– హేమంత్ హత్యకు నిరసనగా తారానగర్ లో ర్యాలీ
– ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి సత్వర న్యాయం చేయాలి
– భాద్యులందరికి శిక్ష పడాల్సిందే: హేమంత్ భార్య అవంతి
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): పోలీసుల నిర్లక్షమే హేమంత్ హత్యకు కారణమని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. హేమంత్ హత్య విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ తారా నగర్ లోని మృతి ఇంటి నుండి బాధ్యుడైన లక్ష్మారెడ్డి ఇంటి వరకు నారాయణ తో పాటు స్థానిక యువకులు సోమవారం సాయంత్రం ర్యాలీ తీసేందుకు ప్రయత్నించారు. కాగా పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకోవడంతో రోడ్డుపైన బైఠాయించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ లక్ష్మారెడ్డి బంధువులు హేమంత్ ను కిడ్నాప్ చేసిన విషయం పోలీసులకు తెలిపిన వెంటనే స్పందించి ఉంటే నిండు ప్రాణం బలి అయ్యేది కాదని మండిపడ్డారు. సకాలంలో స్పందించకపోవడం వల్లే ఘటన చోటు చేసుకుందని, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. ఇప్పటికైనా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి సత్వర న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హేమంత్ భార్య అవంతి మాట్లాడుతూ తన భర్త హత్య కేసులో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా శిక్ష పడాల్సిందేనని, ఎవరికి బెయిల్ కూడా దొరకరాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది రఘు, హేమంత్ సోదరుడు సుమంత్ తదితరులు పాల్గొన్నారు.