య‌జ‌మాని డ‌బ్బుపై క‌న్నేశాడు… యాబై ల‌క్ష‌లు కాజేశాడు

మాదాపూర్‌లో కారు డ్రైవ‌ర్ నిర్వాకం..
న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: తాను ప‌నిచేస్తున్న య‌జ‌మాని డ‌బ్బుపై క‌న్నేసిన ఓ డ్రైవ‌ర్ అదును కోసం ఎదురుచూసి ఏకంగా రూ.50 ల‌క్ష‌ల న‌గ‌దుతో ఉడాయించాడు. చివ‌రికి పోలీసుల చేతికి చిక్కి జైలుపాల‌య్యాడు. మాదాపూర్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకున్న ఈ కేసుకు సంబంధించిన వివ‌రాలు పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం… కర్ణాటక రాష్ట్రం, మార్జాపూర్ ప్రాంతానికి చెందిన హనుమంత్ డోట్రే ( 52 ) కొంతకాలం క్రితం నగరానికి వలసవచ్చి కుకట్ పల్లి సర్దార్ పటేల్ లో నివాసం ఉంటున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వైయస్ ప్రసాద్ వద్ద రెండు నెలల క్రితం డ్రైవర్ గా పనిలో చేరాడు. ప్ర‌తిరోజూ త‌న య‌జ‌మాని పెద్ద‌మొత్తంలో న‌గ‌దును వెంట తీసుకువెళ్ల‌డాన్ని గ‌మ‌నించిన హ‌నుమంతు ఎలాగైనా డబ్బును కాజేయాల‌ని అవ‌కాశం కోసం ఎదురుచూడ‌సాగాడు. ఈ క్ర‌మంలోనే ఏప్రిల్ 8వ తేదీన సా. 8:30 గం.ల‌కు ప్ర‌సాద్ త‌న వ్యాపార భాగస్వాములు ధీరజ్ రెడ్డి , బి.ఎన్‌.ఎం.రాజులతో కలిసి రూ.50ల‌క్ష‌ల న‌గ‌దుతో త‌న కారులో షాపింగ్ నిమిత్తం మాదాపూర్ ఇనార్బిల్‌మాల్‌కు వెళ్లాడు. అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్న హనుమంత్ యజమాని వైయస్ ప్రసాద్ , ధీరజ్ రెడ్డి , బీర్రాజులను ఇనార్బిట్ మాల్ ప్రవేశ ద్వారం వద్ద దించి పార్కింగ్ లోకి వెళ్లాడు. కారులో ఉన్న బ్యాగును తీసుకుని అక్క‌డి నుండి ఉడాయించాడు. షాపింగ్ ముగించుకుని వ‌చ్చిన ముగ్గురు డ్రైవ‌ర్‌కు ఫోన్ చేయ‌గా స్విచ్ఆఫ్ రావ‌డంతో అనుమానం వ‌చ్చిన వైయ‌స్ ప్ర‌సాద్ పార్కింగ్‌లో కారును గుర్తించాడు. డ‌బ్బు బ్యాగు క‌నిపించ‌క‌పోవ‌డంతో మాదాపూర్ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు.

నిందితుల వ‌ద్ద నుండి స్వాధీనం చేసుకున్న డ‌బ్బును చూపుతున్న పోలీసులు

ధీర‌జ్ రెడ్డి ఫిర్యాదుతో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ప్ర‌త్యేక బృందాల‌ను ఏర్పాటు చేసి నిందితుడి కోసం గాలించారు. సిసిటీవి, నిందితుడి సెల్ ఫోన్ సిగ్న‌ల్స్ ఆధారంగా ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు. ఈ నెల 11వ తేదీన హ‌నుమంత్‌నాయ‌క్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అత‌నిని విచారించ‌గా చేసిన నేరం అంగీక‌రించాడు. దోచుకెళ్లిన సొత్తును త‌న సోద‌రుడు ల‌క్ష్మ‌ణ్ డోట్రేకు అంద‌జేసిన‌ట్లు విచార‌ణ‌లో అంగీక‌రించాడు. ఇరువురు క‌లిసి డ‌బ్బుతో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేయాల‌నుకున్న‌మ‌ని, అందులో నుండి కొంత మొత్తాన్ని వ్య‌క్తిగ‌త అవ‌స‌రాలకు ఖ‌ర్చు చేయ‌గా, మ‌రికొంత డ‌బ్బును అప్పులు తీర్చేందుకు వాడిన‌ట్లు తెలిపాడు. దీంతో హ‌నుమంత్‌, ల‌క్ష్మ‌ణ్ ల‌ను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వ‌ద్ద నుండి రూ.40ల‌క్ష‌ల 50 వేల రూపాయల‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు త‌ర‌లించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here