- ‘పాత రేట్ కార్డుల రెన్యూవల్’కూ దరఖాస్తుల ఆహ్వానం
న్యూస్‌పేపర్‌ల ప్రచురణ రంగంలో ఉన్న వారికి పరిచయం అక్కర్లేని పేరు DIRECTORATE OF ADVERTISING AND VISUAL PUBLICITY – DAVP (ప్రస్తుతం Bureau of Outreach and Communication – BOCగా వ్యవహరిస్తున్నారు.) ఏడాదికి రెండుసార్లు చేపట్టే న్యూస్‌పేపర్‌ల ఎంపానెల్‌మెంట్ (Empanelment) తరహాలోనే తగ అయిదేళ్లుగా ఇంటర్నెట్ వెబ్‌సైట్‌లను గుర్తిస్తూ ఎంపానెల్‌మెంట్ చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా అంతర్జాల ప్రచురణకర్తలకు, యాజమాన్యాలకూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధీనంలోని డీఏవీపీ (బీవోసీ) మరో అవకాశం కల్పించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను గత నెల 24నే విడుదల చేసి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన దరఖాస్తు విధానం, మార్గదర్శకాలను డీఏవీపీ తన అధికారిక వెబ్‌సైట్ http://davp.nic.inలో పొందుపర్చారు.
న్యూస్ మీడియాకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంలో భాగంగా ఇంటర్నెట్ వెబ్‌సైట్‌ల ఎంపానెల్‌మెంట్‌కు సంబంధించి సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధీనంలోని డీఏవీపీ (బీవోసీ) జారీచేసిన నోటిఫికేషన్ వెబ్‌సైట్‌ల ప్రస్తుత ఎంపానెల్‌మెంట్ ఈ ఏడాది (2021) మార్చి 31తో ముగియనుంది. దీని ప్రకారం, బ్యూరో ఆఫ్ అవుట్ రీచ్ అండ్ కమ్యూనికేషన్ (బీవోసీ) న్యూఢిల్లీలోని సీజీవో కాంప్లెక్స్, లోధీ రోడ్, న్యూఢిల్లీలోని తన కార్యాలయంలో ఇంటర్నెట్ వెబ్‌సైట్‌ల ద్వారా కేంద్ర ప్రభుత్వ ప్రకటనలను ప్రచారం చేయడం కోసం ఎంపానెల్‌మెంట్ రెన్యూవల్ నిమిత్తం ఆయా ఇంటర్నెట్ వెబ్‌సైట్‌ల నుంచి రెండు బిడ్‌ల సిస్టమ్‌లో తాజా బిడ్‌లను ఆహ్వానిస్తోంది. ఈ ఎంపానెల్‌మెంట్ 2023 మార్చి 31 వరకు చెల్లుబాటు అవుతుంది. అనుబంధం-Iలో జతచేసిన నియమ నిబంధనలకు అనుగుణంగా ఈ ప్యానెల్ 2021 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది.
టెక్నికల్ బిడ్, ఫైనాన్షియల్ బిడ్ కలిగిన రెండు బిడ్ సిస్టమ్‌ల్లో మాత్రమే బిడ్‌లు ఆమోదించనున్నారు. టెండర్ డాక్యుమెంట్‌లను HTTP://WWW.DAVP.NIC.IN/ లేదా సెంట్రల్ పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్ (సీపీపీపీ) వెబ్‌సైట్ https://eprocure.gov.in/epublish/app నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. టెండర్‌లో పాల్గొనాలనుకునే ప్రచురణకర్తలు తమ పూర్తి చేసిన బిడ్‌లను నోటిఫికేషన్‌లోని పేరా-4లో పేర్కొన్న విధంగా స్పీడ్ పోస్ట్/రిజిస్టర్డ్ పోస్ట్/కొరియర్/స్వయంగా తీసుకువచ్చి ఢిల్లీలోని (టెండర్ బాక్స్‌లో డ్రాప్ చేయాలి) దిగువ చిరునామాకు అందేలా సమర్పించాలి.
టెండర్ల సమర్పణకు చివరి తేదీ: 2021 జనవరి 15.
అన్నీ పక్కాగా ఉంటే ఎంపానెల్‌మెంట్ చాలా ఈజీ…
మార్గదర్శకాల ప్రకారం నిర్ణీత ఫార్మాట్‌లో బిడ్ సమర్పించిన వెబ్‌సైట్‌లు ఎంపానెల్‌మెంట్ పొందడం చాలా ఈజీ అనే చెప్పాలి. డీఏవీపీ నిర్ణయించిన ఫార్మెట్‌లో కాకుండా తమ ఇష్టప్రకారం బిడ్ సమర్పించిన వారు మాత్రమే ఈ ప్రయత్నంలో విఫలమవుతున్నారు. ఏడాది సీనియారిటీ కలిగిన అన్ని ఇంటర్నెట్ వెబ్‌సైట్‌లూ డీఏవీపీ (బీవోసీ) ఎంపానెల్‌మెంట్‌కు అర్హత సాధించినట్లే. అయితే, ఇంత వరకూ సరైన అవగాహన లేకనో, ఆర్ధిక ఇబ్బందుల వల్లో, లేక ఇతరత్రా అనేక కారణాల రీత్యో తెలియదు కానీ, ప్రచురణకర్తలు చాలా వరకూ అన్ని అర్హతలు ఉండి కూడా డీఏవీపీ ‘రేటు కార్డు’ కోసం దరఖాస్తుచేయలేకపోయారు. కరోనా విపత్తు సమయంలో ప్రచురణ (ప్రింట్ మీడియా) రంగంతో సహా వెబ్ మీడియానూ ఆదుకోవాలన్న ఆశయంతోనే కావచ్చు, ఇలాంటి ఆపత్కాల పరిస్థితుల్లోనూ డీఏవీపీ సుదీర్ఘ విరామం తర్వాత వెబ్‌సైట్‌ల ఎంపానెల్‌మెంట్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన జారీచేసింది. ఈ నేపథ్యంలో అర్హత కలిగిన అంతర్జాల ప్రచురణకర్తలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దరఖాస్తుచేసుకోవడం వల్ల ప్రయోజనం పొందవచ్చు. పైరవీలతో ఏ మాత్రం సంబంధం లేకుండా అర్హత కలిగిన ఇంటర్నెట్ వెబ్‌సైట్‌లు పొందగలిగే ఈ ‘గర్తింపు’ను వదులుకోకుండా కనీసం ఈసారైనా జర్నలిజాన్ని నమ్ముకున్న ప్రచురణకర్తలు సద్వినియోగం చేసుకుంటారని సలహా.
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మాదిరిగానే వెబ్ మీడియాను కూడా కేంద్రం గుర్తించిన నేపథ్యంలో అర్హత కలిగిన వెబ్‌సైట్లు, వెబ్ ఛానళ్లు ఎంపానెల్‌మెంట్ కోసం దరఖాస్తుచేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు డీఏవీపీ అధికారిక వెబ్‌సైట్ http://davp.nic.inను సందర్శించవచ్చు.