రోడ్డు ప్ర‌మాద ఘ‌ట‌న‌లో వ్య‌క్తి మృతి.. జువైన‌ల్ హోంకు ముగ్గురు మైనర్లు..

సైబ‌రాబాద్‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ద్విచ‌క్ర వాహ‌నంపై ట్రిపుల్ రైడింగ్ చేస్తూ వాహ‌నాన్ని నిర్ల‌క్ష్యంగా న‌డిపి ప్ర‌మాదానికి గురై ఓ వ్య‌క్తి మృతికి కార‌ణ‌మైన ముగ్గురు మైనర్ల‌ను జువైన‌ల్ అబ్జ‌ర్వేష‌న్ హోంకు త‌ర‌లించారు. ఈ మేర‌కు సైబ‌రాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజ‌య్‌కుమార్ గురువారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

గ‌తేడాది సెప్టెంబ‌ర్ 24వ తేదీన సైబ‌రాబాద్ పోలీస్ కమిష‌న‌రేట్ ప‌రిధిలోని బాచుప‌ల్లిలో ముగ్గురు మైన‌ర్ బాలురు ఓ స్కూటీపై బాచుప‌ల్లి నుంచి నిజాంపేట వైపు వ‌స్తున్నారు. కాగా మార్గ‌మ‌ధ్యలో బాచుప‌ల్లి బ్లూ డార్ట్ ఆఫీస్ వ‌ద్ద రోడ్డు దాటుతున్న ఓ సెక్యూరిటీ గార్డును వారు త‌మ ద్విచ‌క్ర వాహ‌నంతో ఢీకొట్టారు. స‌ద‌రు బాలురు ట్రిపుల్ రైడింగ్ చేయ‌డ‌మే కాకుండా అత్యంత వేగంగా నిర్ల‌క్ష్యంగా స్కూటీని న‌డుపుతూ వ‌చ్చి సెక్యూరిటీ గార్డును ఢీకొన‌డంతో అత‌నికి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ క్ర‌మంలో అత‌న్ని చికిత్స నిమిత్తం హాస్పిట‌ల్‌కు త‌ర‌లిస్తుండ‌గా మార్గ‌మ‌ధ్య‌లోనే అత‌ను మృతి చెందాడు.

కాగా ఈ కేసులో నిందితులు మైనర్లు అయినందున వారిని డిసెంబ‌ర్ 30వ తేదీన జువైన‌ల్ బోర్డు ఎదుట హాజ‌రు ప‌రిచారు. ఈ క్ర‌మంలో వారిని బోర్డు అబ్జ‌ర్వేష‌న్ హోంకు త‌ర‌లించింది. కాగా ఆ బాలుర‌లో ఒక బాలుడికి చెందిన త‌ల్లి అత‌నికి వాహ‌నం ఇచ్చినందున ఆమెను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై చ‌ట్ట ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోనున్నారు.

త‌ల్లిదండ్రులు లేదా ఎవ‌రైనా సరే మైనర్ల‌కు వాహ‌నం ఇవ్వ‌కూడ‌ద‌ని, ఇస్తే చ‌ట్ట ప్ర‌కారం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, మైనర్లు వాహ‌నం న‌డిపినా, ఇత‌ర ఎవ‌రైనా స‌రే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహ‌నం న‌డిపినా, రివ‌ర్స్ రూట్‌లో వెళ్లినా, సిగ్న‌ల్ జంపింగ్ చేసినా, మ‌ద్యం మ‌త్తులో వాహ‌నాలు న‌డిపినా మోటార్ వాహ‌న చ‌ట్టం ప్ర‌కారం అలాంటి వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, వారికి గ‌రిష్టంగా 10 ఏళ్ల వ‌ర‌కు జైలుశిక్ష విధించ‌బ‌డుతుంద‌ని పోలీసులు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here