- దీక్షకు ప్రతిపక్ష పార్టీల నాయకుల మద్దతు, సంఘీభావం
- గుర్తింపు పొందిన పాఠశాలల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్
- దీక్షా శిబిరాన్ని సందర్శించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
- సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తామని హామీ
- నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేసిన గాంధీ
శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మండల గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్య సంఘం సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం చందానగర్‌లో సంఘం ముఖ్య సలహాదారుడు డాక్టర్ వెంకటేశ్వరరావు మౌన నిరాహార దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ 2020 – 21 విద్యా వార్షిక ప్రణాళికను విడుదల చేయాలని, బడ్జెట్ పాఠశాలలలో విద్యనభ్య సిస్తున్న పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువులకు దూరమై పోతున్నారని వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయిందని, దీనిని అధిగమించడానికి వార్షిక క్యాలెండర్ ను పరీక్షా తేదీలతో సహా విడుదల చేయాలని, ప్రయివేట్ పాఠశాలలలో విద్యా బోధన చేస్తున్న ఉపాధ్యాయిని, ఉపాద్యాయులకు గురుదక్షిణ నిమిత్తం రూ.5వేలను ఇప్పించాలని, లేదా కేసీఆర్ విద్యాపథకం క్రింద ప్రతి విద్యార్థికి, పేద విద్యార్థులకు మాత్రమే కొంత మొత్తం ఇప్పించాలని, కోవిడ్-19 సమయంలో నీటి బిల్లులు, విద్యుత్ బిల్లులు, కమర్షియల్ పన్నుల చెల్లింపుల్లో సడలింపు ఇవ్వాలని, అద్దె భవనాల విషయంలో యజమానుల ఒత్తిడి లేకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు.
బీజేపీ నాయకుల మద్దతు…
శేరిలింగంపల్లి మండల గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్య సంఘం ప్రతినిధులు చేపట్టిన దీక్షకు నియోజకవర్గం బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరాన్ని నియోజకవర్గ బిజెపి సీనియర్ నాయకుడు రవి కుమార్ యాదవ్, డివిజన్ సీనియర్ నాయకులు సందర్శించారు. అనంతరం రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రైవేట్ టీచర్లను వెంటనే ఆదుకోవాలని, ఫీజు రియంబర్స్‌మెంట్ ని అమలు చేయాలని, అదనపు పన్నుల భారాన్ని రద్దు చేయాలని, విద్యా వ్యవస్థను మళ్లీ దారిలో పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, జ్ఞానేంద్ర ప్రసాద్, కసిరెడ్డి సింధు రఘునాథ్ రెడ్డి, రాధా కృష్ణ యాదవ్, ఎల్లేష్, రాజుశెట్టి పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ మద్దతు…
శేరిలింగంపల్లి మండల గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్య సంఘం ప్రతినిధులు చేపట్టిన దీక్షకు నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ రఘునందన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పబ్బులు, క్లబ్బులు, బార్లు, మాల్స్ ను ఆతృతంగా తెరిచిందని, వాటిని తెరవడంలో ఉన్న శ్రద్ధ ఆలయాలలాంటి పాఠశాలలను తెరిచే విషయంలో లేదని ఎద్దేవా చేశారు. విద్యార్థులు దేశ భవిష్యత్తును నిర్దేశిస్తారని, స్కూళ్లపై ప్రభుత్వం ఎందుకు ఇంత వివక్ష చూపుతుందని ప్రశ్నించారు. తక్షణమే స్కూల్స్‌ను తెరవాలని, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సమస్యలను పరిష్కరించాలని, లేదంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి సందీప్ రెడ్డి, డివిజన్ నాయకుడు ఎం.శ్రీనివాస్, మైనార్టీ నాయకులు హబీబ్, అయాజ్ ఖాన్, అజీం, యూత్ నాయకులు కవి రాజ్, శ్రీహరి, రాజన్, రుబెన్ పాల్గొన్నారు.

ఇతర పార్టీల సంఘీభావం..
కాగా పాఠశాలల యాజమాన్య సంఘం ప్రతినిధులు చేపట్టిన దీక్షకు టిడిపి శేరిలింగంపల్లి నాయకులు నాగ సురేష్ బాబు, శివ గౌడ్, కుర్ర ధనలక్ష్మి, ఎంసిపిఐయు నాయకుడు పల్లె మురళిలు సంఘీభావం తెలిపారు.
దీక్షను విరమింపజేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ…
శేరిలింగంపల్లి మండల గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్య సంఘం ప్రతినిధులు చేపట్టిన దీక్ష శిబిరాన్ని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన వారితో మాట్లాడి వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అనంతరం గాంధీ మాట్లాడుతూ.. సంఘం ప్రతినిధులు తెలిపిన సమస్యలు పరిష్కారం అయ్యేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వారి సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి సత్వరమే పరిష్కారం అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. సంఘం ప్రతినిధులకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, మాజీ కౌన్సిలర్ రామదాసు, హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ కొండా విజయ్ కుమార్, మాదాపూర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.







