శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన లబ్ధిదారులు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు దరఖాస్తు చేసుకోగా ఆయా పథకాల ద్వారా మంజూరైన మొత్తం రూ.77,08,932 లను 77 మంది లబ్ధిదారులకు ఆయన కార్పొరేటర్లు రోజా దేవి రంగారావు, దొడ్ల వెంకటేష్ గౌడ్, జూపల్లి సత్యనారాయణ, నార్నె శ్రీనివాస రావు, ఉప్పలపాటి శ్రీకాంత్‌లతో కలిసి మంగళవారం పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో దేశంలో ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణ ఎంతో ముందు ఉందని తెలిపారు. కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలను కొనసాగించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఎలాంటి కష్టం వచ్చినా ప్రజలను ఆదుకునేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, ఏరియా కమిటీ మెంబర్లు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





