ఎల్‌బీనగర్ (నమస్తే శేరిలింగంపల్లి): ఓ బాలికకు మాయమాటలు చెప్పి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ వ్యక్తికి న్యాయమూర్తి యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ.10వేల ఫైన్ విధించారు. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నార్సింగి గ్రామానికి చెందిన చిత్తారి సాయిలు అలియాస్ సాయి (25) కేపీహెచ్‌బీలోని ప్రగతినగర్ గోల్డెన్ హిల్స్‌లో ప్లాట్ నం.64లో నివాసం ఉంటూ స్థానికంగా కూలిపనులు చేసుకుని జీవిస్తున్నాడు.

కాగా అదే ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్‌కు వాచ్‌మన్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి కుమార్తె అక్కడే ఇండ్లలో పనిమనిషిగా పనిచేస్తోంది. ఈ క్రమంలో సాయిలుకు ఆ బాలికకు పరిచయం ఏర్పడింది. ఆమెను వైజాగ్ తీసుకెళ్తానని బీచ్ చూపిస్తానని చెప్పి ఆమెను వైజాగ్ తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాధితురాలు, ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అరెస్టు చేసి న్యాయమూర్తి ఎదుట సాక్ష్యాలతో సహా ప్రవేశపెట్టారు. దీంతో ఎల్‌బీ నగర్ కోర్టులోని మెజిస్ట్రేట్ బి.సురేష్ పోక్సో చట్టం కింద సాయిలుకు యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ.10వేల జరిమానా విధించారు. దీంతో పోలీసులు నిందితున్ని జైలుకు తరలించారు.





