నమస్తే శేరిలింగంపల్లి: యాదవుల సమస్యల పరిష్కారం కోసం యాదవులందరం కలిసికట్టుగా ఉద్యమించాలని తెలంగాణ రాష్ట్ర యాదవ విద్యావంతుల ఐక్యవేదిక గౌరవ సలహాదారుడు బేరి రామచందర్ యాదవ్ అన్నారు. శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 13న సరూర్ నగర్ స్టేడియంలో జరగబోయే యాదవ యుద్ధభేరి సభను విజయవంతం చేయాలని యాదవులకు యాదవ బంధుమిత్రులకు, ఆయన ఈ ప్రజలకు సందర్బంగా పిలుపునిచ్చారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలాల్లో ప్రతి గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి యాదవులను ఐక్యం చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర విద్యావంతుల వేదిక అధ్యక్షులు చలసాని వెంకట్ యాదవ్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో యాదవులకు 22 ఎమ్మెల్యే, ఏడు ఎమ్మెల్సీ, మూడు లోక్ సభ, రెండు రాజ్యసభ సీట్లు కేటాయించాలని అన్ని పార్టీలకు సూచించారు.
పాలకవర్గాలు, పార్టీలు గొర్రెలు, బర్రెలు, ఆవుల పేర్లు చెప్పి యాదవులను జీవాల కాపర్లుగా పరిమితం చేసి కుల వృత్తుల చట్రంలో ఇరికిస్తున్నారని అన్నారు. భవిష్యత్ యాదవ తరాన్ని చదువులకు దూరం చేయడానికి కుట్ర తెలంగాణలో జరుగుతుందన్నారు. అందుకే సీట్ల వాటా, ఆర్థిక వాటా రాజ్యాధికారమే అంతిమబాటగా నినదించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. యాదవులు గొర్రెల కోసం కాకుండా సీట్ల కోసం పోరాటం చేయాలన్నారు. యాదవులకు జనాభాకు తగిన గుర్తింపును అన్ని పార్టీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికలవేళ బీసీ రాగం వలగపోస్తున్న పాలక పార్టీలు జనాభా పాతిపదికన ఆయా కులాలకు ఎన్ని సీట్లు ఇస్తారో ప్రకటించాలన్నారు. తెలంగాణలో యాదవులు, ఉపకులాలు 18 శాతం ఉన్నాయని గణాంకాలు చెబుతున్నాయని తెలిపారు. యాదవులకు యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర బడ్జెట్లో 18 శాతం నిధులు ఇవ్వాలని కోరారు. జనగణనలో కుల గణన వెంటనే చేపట్టాలన్నారు. యాదవులకు నష్టం కలిగించే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యా ఉపాధికి ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. యూత్ సభ్యులందరం పెద్ద ఎత్తున యాదవ్ యుద్ధభేరి సభకు తరలివచ్చి విజయవంతం చేస్తామని గోకుల్ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యులు శివకుమార్ యాదవ్ ఈ సందర్బంగా తెలిపారు. యాదవ బంధుమిత్రులతోని పెద్ద ఎత్తున వచ్చి సభను విజయవంతం చేస్తామని మదినగూడ యాదవ సంఘం సభ్యులు శ్రీనివాస్ ప్రసాద్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో లాల్చ యాదవ్, శివ నారాయణ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, సుబ్బారావు యాదవ్, దశరధ్ యాదవ్, నగేష్ యాదవ్, మల్లేష్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, యాదవ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.