- ‘యూత్ కెన్ లీడ్’ సమ్మిట్ లో బీజేవైఎం నేత పిలుపు
- భారీ సంఖ్యలో హాజరైన స్థానిక యువతీయువకులు
నమస్తే శేరిలింగంపల్లి: యువత రాజకీయాల్లోకి రావాలని.. అవినీతి, బంధుప్రీతితో నిండిపోయిన తెలంగాణ రాజకీయాలను మార్చాల్సిన బాధ్యత వారిపై ఉందని బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి మారబోయిన రఘునాథ్ యాదవ్ అన్నారు. ఇందులో భాగంగా శేరిలింగం పల్లి నియోజకవర్గ వ్యాప్తంగా యూత్ కెన్ లీడ్ పేరుతో సదస్సులు నిర్వహిస్తున్నారు. ఆదివారం సాయంత్రం అయ్యప్ప సొసైటీ పరిధిలోని సాయి గార్డెన్స్ లో నిర్వహించిన ఈ యూత్ కెన్ లీడ్ రాజకీయ సదస్సులో పాల్గొని ప్రసంగించారు. ఈ సమ్మిట్ కు స్థానిక యువత భారీ సంఖ్యలో హాజరయ్యారు. రాజకీయాల్లో డబ్బు కాదు CASH కావాలి, ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి రావాలంటే డబ్బు కావాలనే పరిస్థితిని మార్చాలని అభిప్రాయపడ్డారు. యువత రాజకీయాల్లోకి రావాలంటే CASH ఉండాలని, CASH అంటే క్రెడిబిలిటీ (విశ్వసనీయత), అకౌంటబిలిటీ (జవాబుదారీతనం), సిన్సియారిటీ( నిజాయతీ), హానరబిలిటీ (గౌరవం) ఉండాలని నిర్వచనం చెప్పారు.
రాష్ట్రంలో పాలకులు రాజకీయ నిరుద్యోగులకు పదవులిచ్చారు కానీ.. యువతకు కనీసం ఉద్యోగాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నారని ప్రభుత్వం పై మండిపడ్డారు. స్వరాష్ట్రంలో ఉద్యోగ పరీక్షలు రాయాలని ఉద్యమ సమయంలో పోరాడిన యువకులు ఇప్పటికీ సరైన నోటిఫికేషన్లు రాక కుటుంబాలను వదిలి వేయికళ్లతో ఎదురు చూస్తున్నారని వాపోయారు. అసలు ఒక్క గ్రూప్ నోటిఫికేషన్ కూడా వేయకుండా ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రభుత్వం బహుశా ప్రస్తుత తెలంగాణ సర్కార్ ఒక్కటే అయ్యుంటుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన యువకుల రక్తపు ధారలు ఇంకా ఆరలేదని, రాష్ట్ర పరిస్థితి చూసి ఇందుకోసమా ప్రాణత్యాగం చేసిందని వారి ఆత్మలు ఘోషిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆశయాల సాధన కోసమైన రాజకీయం చైతన్యం నరనరాన నిండి ఉన్న యువత అంతా మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు.