మనిషన్న ప్రతీ ఒక్కరికీ నిద్రలో కలలు రావడం అనేది సహజమైన ప్రక్రియ. కలలు రావడం అనేది ఒక అనియంత్రిత క్రియ, అంటే కలలు ఎప్పుడు రావాలి, ఎలాంటి కలలు రావాలి అనేది మనం నిర్ణయించలేము. కొంతమందికి వారు రోజూ చూసే వ్యక్తులు,ప్రదేశాలు, సంభాషణలు కలల్లో రావడం వింటూ ఉంటాము. మరికొందరికి వారికి సంబంధం లేకుండా కలలు అనేవి వస్తూ ఉంటాయి. అసలు కలలు రావడానికి కారణం ఏమిటి అంటే మెదడులో జరిగే కొన్ని రసాయన చర్యల ఫలితమే అనేది శాస్త్రజ్ఞులు చెప్పే మాట. మరి మనకు వచ్చే కలలను నియంత్రించవచ్చా..? మనకు నచ్చిన కలను కనేలా ముందే నిర్ణయించుకోవడం సాధ్యపడుతుందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు అమెరికాకు చెందిన ఎం ఐ టి మీడియా ల్యాబ్ శాస్త్రవేత్తలు.
ఎం ఐ టి మీడియా ల్యాబ్ కు చెందిన శాస్త్రవేత్తలు టార్గెటెడ్ డ్రీం ఇంక్యూబేషన్ అనే పద్దతి ద్వారా కలలను నియంత్రించగలిగే సాంకేతికతను కనుగొన్నారు. ఈ పద్దతిలో ముందుగా డార్మియో అనే పరికరం ద్వారా నిద్రను ట్రాక్ చేస్తారు. అనంతరం లక్ష్యంగా చేసుకున్న కలలను ఉత్పత్తి చేయడానికి మాస్కా, హిప్నోడైన్ మరియు సాధారణ పాలిసోమ్నోగ్రఫీని పద్దతులను ఉపయోగిస్తారు. మనం ఎటువంటి కలలను నిద్రలో ఆస్వాదించాలనుకుంటున్నామో ఆ థీమ్ కు సంబందించిన సంగీతాన్ని, శబ్దాలను నిద్రలోకి జారుకున్నాక వినిపిస్తారు. ఫలితంగా మనం నిద్రలో ఉన్నప్పటికి ఆ శబ్దాలను వింటూ నిర్దేశించబడిన కలలు మనకు కనిపిస్తాయి.
సాధారణ కలల మాదిరిగానే, టార్గెట్ డ్రీమింగ్ అనేది ఒక నిర్దిష్ట స్థితిలో నిద్ర మరియు నిర్దిష్ట ఉద్దీపనలపై దృష్టి కేంద్రీకరించే పద్ధతి అని, ఇది కలలను ఒక నిర్దిష్ట మార్గంలో మార్చడానికి వివిధ సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించి వీలవుతుందని పరిశోధన బృందం తెలియజేసారు. ఈ విధానం మనకు అందుబాటులోకి వస్తే మనం ఎంపిక చేసుకున్న కలలని చూసుకునే అవకాశం దొరకడం నిజంగా విచిత్రమే కదా.