- వైద్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన జనసైనికులు
నమస్తే శేరిలింగంపల్లి: తల్లిదండ్రులు జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మని ఇస్తారని జనసేన శేరిలింగంపల్లి ఇంచార్జ్ డాక్టర్ మాధవ రెడ్డి అన్నారు. వైద్యం అంటే వృత్తిగా కాకుండా మనుషుల్ని బ్రతికించే ఒక మహాశక్తిగా ప్రజలకు సేవలు అందిస్తున్న వైద్యులను దేవుడిగా భావించే సంస్కృతి మనదన్నారు.
వైద్యో నారాయణో హరి అనే మాటను పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు అది మనకు తెలిసిందే కదా అన్నారు. ఆరోగ్యపరమైన సమస్యలతో వచ్చిన వారికి స్వస్థత కలిగించి రోగులు వారి కుటుంబీకుల ముఖాన చిరునవ్వులు చూసి సంతోషించే వైద్యులు ఎందరో ఉన్నారని, కరోనా విపత్కర పరిస్థితుల్లో ఎంతో తెగింపుతో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వైద్యసేవలు అందించిన వైద్యులందరికీ జాతీయ వైద్యుల దినోత్సవ సందర్భంగా జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం తరపున శుభాకాంక్షలు తెలిపారు. ఆస్పత్రుల, వైద్యుల పైన దాడులకు ఆస్కారం లేకుండా కఠినమైన జీవోలు తీసుకురావాలని, గ్రామీణ , గిరిజన ప్రాంతాల్లో మెరుగైన వైద్యం అందించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంటుందని చెప్పారు. అయితే శేర్లింగంపల్లి నియోజకవర్గం లోని చాలా పిహెచ్ఎస్ లో వైద్య పరికరాలు లేక, పరిశుభ్రత లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా శేర్లింగంపల్లిలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు కళ్యాణ్ చక్రవర్తి, నాయక్, దుర్గ ప్రసాద్, హరి, రాజేష్ నాయక్, శ్రవణ్ కుమార్ నాయక్ పాల్గొన్నారు.