నమస్తే శేరిలింగంపల్లి: తలపై బండరాయితో మోది ఓ గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసిన సంఘటన రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సోమవారం ఉదయం రాయదుర్గం స్టేట్ బ్యాంకు ముందు గల బస్‌స్టాప్‌లో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శవ పంచనామా నిర్వహించారు. మృతుడు 35-40 సంవత్సరాల వయసు కలిగి ఉంటాడని, తెలుపు రంగు ఛాయ, నలుపు రంగు జుత్తు, మీసాలు కలిగి ముస్లీం అయ్యుండచ్చన భావిస్తున్నారు. ఒంటిపై బూడిద, నీలి రంగు షర్టు, నీలి రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని, మెడ ఎడమ వైపు పుట్టు మచ్చ కలిగి ఉన్నట్లు తెలిపారు. ఆదివారం రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో తలపై మోదడంతో బలమైన గాయాల కారణంగా మృతి చెందినట్లు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు వెల్లడించారు. మృతుడి ఆనవాలు తెలిసిన వారు రాయదుర్గం పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.