ఆ ముగ్గురు కార్పొరేటర్లకు అందని ద్రాక్ష

శేరిలింగంపల్లి లో ముగ్గురు సిట్టింగులకు మొండి చెయ్యి…?

  • డివిజన్ల రిజర్వేషన్లలో మార్పు లేనట్టే.
  • విధేయతకే పెద్దపీట…ఎమ్మెల్యే ఆశీర్వాదమూ తప్పనిసరి.

శేరిలింగంప‌ల్లి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గ్రేట‌ర్‌ ఎన్నిక‌ల వేళ శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మార‌నున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో ప‌దింటికి ప‌ది డివిజ‌న్లు కైవ‌సం చేసుకున్న అధికార పార్టీ రాన్నున్న ఎన్నిక‌ల్లోనూ అదే పంథాను కొన‌సాగించాల‌నే ప‌క్క ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగుతుంది. అభ్య‌ర్థుల విష‌యంలో ఇప్ప‌టికే అధిష్టానం ఒక అంచ‌నాకు వ‌చ్చిన‌ట్టు తెలుస్తుంది. మంగ‌ళ‌వారం మినిస్ట‌ర్స్ క్వార్టర్స్‌లో ప్ర‌జాప్ర‌తినిధుల‌తో పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జ‌రిపిన ప్ర‌త్యేక స‌మావేశంలో 15 మంది కార్పొరేట‌ర్ల ప‌నితీరు బాగాలేద‌ని హెచ్చ‌రించిన విష‌యం విదిత‌మే. ఐతే ఆ ప‌దిహేను మందిలో శేరిలింగంప‌ల్లి కార్పొరేట‌ర్లు ఎవ‌రైనా ఉన్నారా అనే ప్ర‌శ్న ఉత్ప‌న్నం అవ్వ‌క‌మాన‌దు. ఆ విష‌యానికి వ‌స్తే ఇక్క‌డ కొంద‌రికి ముప్పు త‌ప్పేలా లేదు అని అర్ధం అవుతుంది.

రిజర్వేషన్లలో మార్పులు లేవు…

ప్ర‌స్థుతం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాల‌టీల‌కు ఒక చ‌ట్టం, జీహెచ్ఎంసీకి ప్ర‌త్యేకంగా మ‌రో చ‌ట్టం అమ‌ల‌వుతుంది. కాగా ఇటీవ‌ల జ‌రిగిన మున్సిపాలిటీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనే కార్పొరేష‌న్ల‌ మేయ‌ర్ ప‌ద‌వుల‌కు సైతం రిజ‌ర్వేష‌న్ల‌ను ఖ‌రారు చేశారు. తాజాగా డివిజ‌న్ల వారిగా రిజ‌ర్వేష‌న్ల‌ను ప్ర‌క‌టించాల్సి ఉండ‌గా గ‌త రిజ‌ర్వేష‌న్ల‌ను య‌థావిదిగా మ‌రోసారి కొన‌సాగించే వెసులు బాటు ఉంది. దానికి తోడు జీహెచ్ఎంసీతో పాటు ఇత‌ర కార్పొరేష‌న్‌ల‌ను, మున్సిపాలిటీల‌ను అన్నింటిని క‌లిపి ఒక‌టే చ‌ట్టాన్ని తీసుకురావాల‌నే ఆలోచ‌న‌లోను ప్ర‌భుత్వం ఉంది. ఆ విధంగా అడుగు ముందుకు వేసినా కూడా రానున్నఎన్నిక‌ల్లో గ‌తంలో ఉన్న రిజ‌ర్వేష‌న్లనే ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు.

విధేయ‌త‌కే పెద్ద‌పీట‌… ఎమ్మెల్యే ఆశీర్వాదం

టీఆర్ఎస్ పార్టీ బ్యాన‌ర్‌పై గెలిచి పార్టీకి వ్య‌తిరేఖంగా ప‌నిచేసిన వారిపై అధిష్టానం సీరియ‌స్ గా ఉంద‌ని తెలుస్తుంది. ఇటీవ‌ల జ‌రిగిన శాస‌న‌స‌భ్యుల ఎన్నిక‌ల్లో వ్య‌క్తిగ‌త ప్రాధాన్య‌త‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని సొంత‌పార్టీ అభ్య‌ర్థికి ప్ర‌తికూలంగా ప‌నిచేసిన వారిపై వేటు వేసే ఆలోచ‌న‌లో ఉంది పార్టీ. గ‌త ఎమ్మెల్యే ఎన్నిక‌ల్లో పార్టీ అభ్య‌ర్థుల‌కు వ్య‌తిరేఖంగా ప‌నిచేసిన జూప‌ల్లి, క‌డియం లాంటి దిగ్గ‌జాల‌ను సైతం పార్టీ ప‌క్క‌న పెట్టిన విష‌యం అంద‌రికి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ విదేయ‌త‌కు క‌ట్టుబ‌డ‌కుండా స్వ‌ప్ర‌యోజ‌నాల‌తో వ్య‌వ‌హ‌రించిన కార్పొరేట‌ర్ల‌కు సైతం చెక్ పెట్టవ‌చ్చు అనే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏ అంశాల విష‌యానికి వ‌చ్చినా ఎమ్మెల్యేల‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని పేర్కొంటు వ‌స్తున్న‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్ బ‌ల్దియా ఎన్నిక‌ల్లోను వారికే పెద్ద‌పీట వేయ‌నున్నట్టు తెలుస్తుంది. బ‌రిలో ఉన్నఅభ్య‌ర్థుల‌ శ‌క్తి సామ‌ర్థ్యాలు, ఇత‌ర వ్య‌వ‌హారాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటూనే స్థానిక ఎమ్మెల్యేల అభిప్రాయాల‌కు ప్రత్యేక ప్రాధాన్య‌త‌ను క‌ల్పించ‌నున్నారు. ఈ క్ర‌మంలోనే మొన్న‌టి వ‌ర‌కు స్థానిక ఎమ్మెల్యేకి దూరంగా ఉంటు వ‌స్తున్న శేరిలింగంప‌ల్లి కార్పొరేట‌ర్లు కొంద‌రు ఇప్పుడు ఆయ‌న‌ను ప్ర‌స‌న్నం చేసుకునే ప‌నిలో ప‌డ్డారు. ఐతే ఆయ‌న‌ను న‌మ్మ‌కుని పార్టీలో చేరిన వారికి ఎంత వ‌ర‌కు స్థానం ద‌క్కుతుందో వేచి చూడాల్సిందే.

ఆ ముగ్గురుకి డౌటే…

పైన పేర్కొన్న అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ప‌రిశీలిస్తే శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ఈ సారి మూడు స్థానాల్లో కార్పొరేట‌ర్ల అభ్య‌ర్ధిత్వాలు గల్లంతు అయ్యేలా క‌నిపిస్తున్నాయి. అందులో వయోభారం తో డివిజన్ ప్రజలకు అందుబాటులో లేని కార్పొరేటరు ఒకరు ఉండ‌గా.. డివిజ‌న్‌లో ప‌లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటూ ఓ జాతీయ పార్టీ తో స‌న్నిహితంగా మెదులుతున్నార‌నే నెపంతో మ‌రో కార్పొరేట‌ర్‌కు చెక్ పెట్టే ప‌రిస్థితి నెల‌కొంది. అదేవిధంగా మరో కార్పొరేటరు విషయంలో ఎలాంటి ఆరోపణలు లేకపోయినా కొత్తవారికి స్థానం కల్పించే ఉద్దేశంతో మరో సిట్టింగ్ కార్పొరేటర్ కు అధిష్టానం మొండి చెయ్యి చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మూడింటితో పాటు ఇతర ప‌లు స్థానాల్లోను కొన్నిమార్పులు చోటు చేసుకునే అవ‌కాశం లేక‌పోలేదు. రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ నుండి టికెట్ దక్కించుకుని రేసులో నిలిచేదెవరో…? బరినుండి తప్పుకునేదెవరో తెలుసుకోవాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.

Advertisement

6 COMMENTS

  1. Nice app and news are in deep of sherilingampally…
    This kind of in deep news throughout Telanagana or GHMC limits would be great…really appreciate your work Vinay👌🏻

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here