గ్రేటర్ హైద‌రాబాద్‌లోని ప్ర‌త్యేక కేంద్రాల్లో కోవిడ్ టీకా పంపిణీ నిలిపివేత

నమస్తే శేరిలింగంపల్లి: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శనివారం(17-07-21) ప్ర‌త్యేక కేంద్రాల‌లో కోవిడ్ టీకా పంపిణీ నిలిపివేస్తున్నట్లు గ్రేట‌ర్ ప‌రిధిలోని జిల్లా వైద్యాధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం నుండి వాక్సిన్ సరఫరా లేకపోవడంతో ఏర్పడిన కొరత కారణంగా శనివారం జిహెచ్ఎంసి పరిధిలోని అన్ని ప్ర‌త్యేక కేంద్రాలలో వ్యాక్సిన్‌ పంపిణీ నిలిపివేయనున్న‌ట్టు తెలిపారు. జిల్లా ఉప వైద్యాధికారులు, మండల అధికారులు సమాచారాన్ని జిహెచ్ఎంసి ప‌రిధిలోని అధికారులకు, ప్రజలకు చేరవేయాలని ఆమె సూచించారు. ఐతే ఆదివారం సాదార‌ణంగా వ్యాక్సినేష‌న్ సెంట‌ర్ల‌కు సెల‌వు. ప్ర‌భుత్వం నుంచి సోమ‌వారం వ‌ర‌కు వ్యాక్సిన్ వ‌స్తే ఆరోజు టీకాలు ప్ర‌జ‌లకు అంద‌వ‌చ్చు. లేనియెడ‌ల మంగ‌ళ‌వారం బ‌క్రీద్ సంద‌ర్భంగా ప్ర‌భుత్వ సెల‌వు. అదేవిధంగా బుద‌వారం మ‌ళ్లీ వ్యాక్సినేష‌న్ సెంట‌ర్ల‌కు సెల‌వు. ఈ లెక్క‌న గురువారం వ‌ర‌కు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ లేక‌పోవ‌చ్చ‌నే తెలుస్తుంది. ప్ర‌త్యేక వ్యాక్సినేష‌న్ సెంటర్ల‌లో శుక్ర‌వారం నుంచే రెండ‌వ డోసు పంపిణీ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో పెద్ద మొత్తంతో వ్యాక్సిన్ నిల్వ‌లు అవ‌స‌రం ఉన్న నేప‌థ్యంలో వాటిని స‌మ‌కూర్చుకునేందుకు ఈమాత్రం సమ‌యం త‌ప్ప‌ద‌ని నిపుణులు పేర్కొంటున్నారు.

ఆరోగ్య కేంద్రాల‌లో య‌ధావిధిగా వ్యాక్సిన్ పంపిణీ…
ప్ర‌త్యేక కేంద్రాల్లో టీకా నిలిచిపోయిన‌ప్ప‌టికి ప్ర‌భుత్వ ఆరోగ్య కేంద్రాల‌లో వ్యాక్సినేష‌న్ యధావిధిగా కొన‌సాగుతుంద‌ని ఆయా కేంద్రాల‌ వైద్యాధికారులు పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో శేరిలింగంప‌ల్లిలోని కొండాపూర్ ఏరియా హాస్పిట‌ల్‌లో, శేరిలింగంప‌ల్లి ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రం, హ‌ఫీజ్‌పేట్‌లోని ప‌ట్ట‌ణ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల‌లో శ‌నివారం కోవాక్జీన్ రెండ‌వ డోసు పంపిణీ జ‌రుగుతుంద‌ని తెలిపారు. కోవాక్జీన్ మొద‌టి డోసు తీసుకుని 28 రోజులు పూర్త‌యిన వారు రెండ‌వ డోసుకు అర్హుల‌ని, అలాంటి వారు ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్ లాంటిది లేకుండానే నేరుగా వ‌చ్చి తమ రెండ‌వ డోసు తీసుకోవ‌చ్చ‌ని తెలిపారు. ఈ అవ‌కాశాన్ని ఆయా ప్రాంతాల ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని వైద్యాధికారులు సూచించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here