సాధారణ కార్యకర్తను సైతం దేశ నాయకుడిగా మార్చే సత్తా బీజేపీకె ఉంది : తేజస్వి సూర్య

  • శేరిలింగంపల్లి లో ఉత్సాహంగా కొనసాగిన బీజేవైఎం జాతీయ అధ్యక్షుడి రోడ్ షో
  • టిఆర్ఎస్ కు ఓటు వేస్తె ఎంఐఎం నాయకుడు మేయర్ అవుతాడు: ధర్మపురి అరవింద్

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు బదులుగా కుటుంబం కోసం పరిపాలన సాగిస్తూ ప్రజాస్వామ్యం అర్థాన్ని మార్చివేసిందని బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు తేజస్వి సూర్య పేర్కొన్నారు. సోమవారం జీహెచ్ఎంసి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మాదాపూర్ హనుమాన్ దేవాలయం నుండి తారనగర్ తుల్జాభవాని ఆలయం వరకు ఎంపీ ధర్మపురి అరవింద్ తో కలిసి రోడ్ షో లో పాల్గొన్నారు.

బీజేపీ రోడ్ షో లో యువతను ఉద్దేశించి ప్రసంగిస్తున్న తేజస్వి సూర్య

ఈ సందర్భంగా తేజస్వి సూర్య మాట్లాడుతూ దక్షిణ భారత దేశంలో హైదరాబాద్ బెంగళూరు నగరాలు ఆర్థికంగా వెన్నుదన్నుగా ఉండేవని తెలిపారు. గత కొన్నేళ్లుగా హైదరాబాద్ నగరంలో ప్రభుత్వాలు విజన్ లేకుండా కేవలం కమీషన్ల కోసమే పరిపాలన సాగిస్తున్నాయని అన్నారు. హైదరాబాద్ నగరం లో జరుగుతున్న ఎన్నికలు దేశ వ్యాప్తంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయని, కుటుంబ పాలనలను భూస్థాపితం చేసి భాగ్యనగరానికి పూర్వ వైభవం తీసుకురావాలని పిలుపునిచ్చారు. సాధారణ కార్యకర్తలను దేశ నాయకులుగా మార్చగలిగే సత్తా బీజేపీకే ఉందని, పార్టీ గెలుపును ప్రతీ కార్యకర్త తన గెలుపుగా భావించాలన్నారు. హైదరాబాద్ నగర ప్రజలు తనపై చూపుతున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడినై ఉంటానన్నారు.

రోడ్ షో లో ప్రజలకు అభివాదం చేస్తున్న తేజస్వి సూర్య, ధర్మపురి

అనంతరం ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ ఎన్నికల్లో యువత ఎంతో ఉత్సాహంగా పని చేస్తున్నారని, ఇదే జోష్ పోలింగ్ తేదీ వరకు కొనసాగించాలన్నారు. హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడిన అక్బరుద్దీన్ తో జత కట్టి కెసిఆర్ హిందువులకు ద్రోహం చేస్తున్నాడన్నారు. టిఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే హైదరాబాద్ మేయర్ పీఠం పై ఎంఐఎం నాయకుడు కూర్చుంటాడని తెలిపారు. జిహెచ్ఎంసి ఎన్నికలు మార్చిలో జరగాల్సి ఉండగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఓటమి భయంతో హడావిడిగా డిసెంబర్ లోనే నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతున్నా, రాష్ట్రంలో ఎన్నో సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఇంతకాలం మొహం చాటేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల ముందు మీడియా ముందుకు వచ్చి నీళ్లు, కరెంట్ ఉచితంగా ఇస్తామంటూ చేస్తున్న హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు.

రోడ్ షో లో భాగంగా బైక్ ర్యాలీలో పాల్గొన్న బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు

2016 ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. నియోజకవర్గ ప్రజలు ఎన్నికల్లో బీజేపీ కి ఓటు వేసి శేరిలింగంపల్లి ని కాషాయమయం చేయాలనీ కోరారు. ఈ పర్యటనలో నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్ గజ్జల యోగానంద్, నాయకులు ఎం.రవికుమార్ యాదవ్ లతో పాటు పార్టీ అభ్యర్థులు రాధాకృష్ణ యాదవ్, రఘునాథ్ యాదవ్, అనూష మహేష్ యాదవ్, కే.రాఘవేందర్ రావు, కసిరెడ్డి సింధు రఘునాథ్ రెడ్డి, కర్చర్ల ఎల్లేష్ లతో పాటు బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

తేజస్వి సూర్య ప్రసంగాన్ని అస్కతిగా వింటున్న బీజేపీ కార్యకర్తలు, ప్రజలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here