- సైబరాబాద్ పరిధిలో “స్టాప్ లైన్ ఉల్లంఘన”లపై నేటి నుంచి స్పెషల్ డ్రైవ్
- పాదచారుల భద్రతే తొలి ప్రాధాన్యత : సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టి. శ్రీనివాసరావు
నమస్తే శేరిలింగంపల్లి: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో నేటి నుంచి స్టాప్ లైన్ ఉల్లంఘనలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టి. శ్రీనివాసరావు తెలిపారు. విప్రో సర్కిల్ వద్ద మంగళ వారం డీసీపీ ట్రాఫిక్ సైబరాబాద్ టి శ్రీనివాస రావు, ఐపీఎస్., స్పెషల్ డ్రైవ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమి షనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., ఆదేశాలతో పాదచారుల భద్రత దృష్ట్యా నవంబర్ 1వ తేదీ నుంచి స్టాప్ లైన్ ఉల్లంఘనలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సిగ్నల్ పడిన తర్వాత స్టాప్ లైన్ దాటి జీబ్రా క్రాసింగ్ లేదా అంతకంటే ముందు వాహనాలు ఆపుతారో వారిపై మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 177 ప్రకారం 100 రూపాయల జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. పాదచారులు కూడా జీబ్రా క్రాసింగ్ వద్దనే రోడ్డు దాటాలని సూచించారు. పాదచారుల భద్రతే తమ తొలి ప్రాధాన్యత అన్నారు.
ఈ డ్రైవ్ లో ఏడీసీపీ శ్రీనివాస్ రెడ్డి, మాదాపూర్ ఏసీపీ హనుమంత రావు మరియు గచ్చిబౌలి ట్రాఫిక్ ఎస్ హెచ్ ఓ నవీన్ పాల్గొన్నారు.