నమస్తే శేరిలింగంపల్లి : వసంత పంచమి సందర్భంగా శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో ఉదయం 4 గంటలకు శ్రీ జ్ఞాన సరస్వతీదేవికి సుప్రభాతం, పంచామృత అభిషేకం, అలంకరణ ప్రత్యేక పూజలు – అర్చనలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. అక్షరాభ్యాసంతో పిల్లలు జ్ఞానవంతులవుతారని, విద్యావంతులు అవుతారని తల్లిదండ్రుల ప్రగాఢ విశ్వాసంగా చెప్పారు.
అనంతరం సాయంత్రం 6 గంటలకు సహస్రనామార్చన, గ్రంథములను పల్లకిలో ఊరేగింపు, విద్యార్థులచే సామూహిక ప్రార్థనలు, జ్ఞాన దీపాలంకరణ, పాడుతా తీయగా సీజన్ 20 చిన్నారులచే భక్తిగీతాల సంగీత విభావరి రాజోపచారాలు నిర్వహించారు.
అనంతరం మహా హారతి, ప్రసాద వితరణ. అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతికిరణ పుంజాన్ని వెదజల్లే దేవత సరస్వతీ దేవి, జ్ఞానశక్తికి అధిష్టాన దేవత అయిన ఆ సరస్వతి దేవి ఆశీస్సులు, అనుగ్రహం మన అందరి పైన ఎల్లవేళలా ఉండాలని ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకురాలు భారతీయం సత్యవాణి వివరించారు.