నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ ఏరియా హాస్పిటల్ లోని ఓ డాక్టర్ ను తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సస్పెండ్ చేశారు. మంత్రి హరీష్ రావు సోమవారం ఉదయం కొండాపూర్ ఏరియా హాస్పిటల్ ను ఆకస్మికంగా సందర్శించారు. హాస్పిటల్లో అందుతున్న వైద్యసేవలపై రోగులను ఆరాతీశారు. గైనకాలజీ వార్డును సందర్శించిన మంత్రి సదరు వార్డులో నిత్యం స్కానింగ్ పరీక్షలు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. అందుకోసం అదనంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఏరియా హాస్పిటల్ కి వచ్చే గర్భిణీలకు 60 శాతానికి పైగా సాధారణ కాన్పులు జరగడం పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సంఖ్యను మరింతగా ప్రోత్సహించాలని సిబ్బందికి సూచించారు.
ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం రూ.2 వేలు అడిగిన డాక్టర్…
డ్రైవింగ్ లైసెన్స్ లకు సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం వస్తే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని అక్కడున్న పలువురు మంత్రి హరీష్ రావ్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి అక్కడున్న వాచ్మెన్, ఇతర సిబ్బందిని అక్కడే విచారణ చేశారు. బాధితులు చేసిన ఆరోపణలను నిజమని నిర్ధారణ చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం రూ.2 వేలు డిమాండ్ చేసిన పిడియాట్రీషన్ డాక్టర్ మూర్తిని అక్కడికక్కడే సస్పెండ్ చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే వహించినా, సేవల విషయంలో డబ్బులు డిమాండ్ చేసిినా కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని మంత్రి హెచ్చరించారు. ఎంతో నమ్మకంతో ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే రోగులకు సంతృప్తి కలిగేలా సేవలందించాలని సూచించారు.