శేరిలింగంపల్లి, నవంబర్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): ఒలింపిక్ బ్యాడ్మింటన్ పతక విజేత, పద్మభూషణ్ అవార్డు గ్రహీత సైనా నెహ్వాల్ ఐవిజన్ యూత్ పార్లమెంట్ మూడో ఎడిషన్ గ్రాండ్ ఫినాలే ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆమె స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. జీవితంలో ఏదీ అసాధ్యం కాదని, మన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటూ నిరంతరం మెరుగుపడేందుకు ప్రయత్నించాలని విద్యార్థులకు సూచించారు. యూసుఫ్‌గూడలోని శౌర్య కన్వెన్షన్ సెంటర్లో నవంబర్ 23, 24 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ గ్రాండ్ ఫినాలేలో తెలంగాణలోని 27 పాఠశాలలకు చెందిన 400 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.

మాక్ పార్లమెంటరీ సమావేశాలు, చర్చలు, వివిధ కమిటీల సమావేశాల ద్వారా విద్యార్థులు సమకాలీన అంశాలపై చర్చించి, భిన్న అభిప్రాయాలను విశ్లేషించారు. సమస్యలకు పరిష్కారాలను ప్రతిపాదించే దిశగా సమిష్టిగా పనిచేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చలు, సంప్రదింపులు ఎలా జరుగుతాయో ఆచరణాత్మకంగా తెలుసుకోవడంతోపాటు మాట్లాడడం, ఇతరుల అభిప్రాయాలను వినడం, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడానికి ఈ కార్యక్రమం దోహదపడింది. విద్యార్థులందరికీ, పాఠశాలలకు ఉచితంగా ప్రవేశం కల్పించడం ద్వారా వివిధ విద్యా, సామాజిక, ఆర్థిక నేపథ్యాలకు చెందిన పిల్లలకు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించారు.

బిల్డ్ ఏ బెటర్ ఫ్యూచర్ (BBF) ఆధ్వర్యంలో, కార్యదర్శి అంజలి గుప్తా నేతృత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇక్షణా మార్కెటింగ్ సహకారం అందించగా, సంస్థ సీఈఓ అంకుర్ గుప్తా భాగస్వామ్యం వహించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమానికి స్పాన్సర్‌గా వ్యవహరించింది. 2023 సెప్టెంబర్‌లో స్థాపించబడిన బిల్డ్ ఏ బెటర్ ఫ్యూచర్ (BBF) హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణలోని గ్రామీణ, ప్రభుత్వ, తక్కువ ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ పాఠశాలల అభివృద్ధి కోసం పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ. ప్రాజెక్ట్ A.M.R.I.T.తో పాటు ఉపాధ్యాయుల అభివృద్ధి కార్యక్రమాల ద్వారా పాఠశాలలకు బోధన, అభ్యసన సామగ్రి, గ్రంథాలయాలు, రీడింగ్ కార్నర్లు, కార్యకలాపాల ఆధారిత విద్యా విధానాలను అందిస్తూ విద్యా ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తోంది.





