శేరిలింగంపల్లి, నవంబర్ 24 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో ఉన్న జయశంకర్ పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి బోర్ ను PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, మాజీ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. జయశంకర్ పార్కులో మంచినీటి బోర్‌ను ప్రారంభించడం సంతోషకరమైన విషయమని అన్నారు. పార్కు అభివృద్ధికి, ముఖ్యంగా మొక్కల సంరక్షణకు ఈ బోర్ ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అందుబాటులోకి వచ్చిన నీటి వసతిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రతి కాలనీలోని నివాసితులు తమ ఇళ్ల ఆవరణలో తప్పనిసరిగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని గాంధీ పిలుపునిచ్చారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాల పెంపునకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని కోరారు. ఇంకుడు గుంతల ఏర్పాటులో ప్రతి కాలనీ ఆదర్శంగా నిలవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. జయశంకర్ పార్కులో ఇప్పటికే అన్ని రకాల మౌలిక వసతులు కల్పించామని గాంధీ తెలిపారు. పార్కుకు వచ్చే వాకర్లకు, సేదతీరే వృద్ధులకు అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేశామని చెప్పారు. చిన్నారుల కోసం ఆటవిడుపు పరికరాలు, పుస్తక పఠనం కోసం లైబ్రరీని అందుబాటులోకి తీసుకొచ్చామని వివరించారు. జయశంకర్ పార్కును సుందరమైన వనంగా తీర్చిదిద్ది, ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యమని తెలిపారు. హఫీజ్‌పేట్ డివిజన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తామని ఆరెకపూడి గాంధీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






