శేరిలింగంపల్లి, నవంబర్ 23 (నమస్తే శేరిలింగంపల్లి): భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలను అన్నమయ్యపురంలో ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈసారి కూడా భక్తి కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా పద్మశ్రీ డా. శోభారాజు శిష్య బృందానికి చెందిన సందీప్, సాయి తేజస్వి, ఆశ్రిత, గమ్య, రీతూ, రన్విత తదితరులు సంయుక్తంగా సాయి సంకీర్తనా గానాన్ని ఆలపించారు. ఓం మహా గణపతయే నమః, శ్రీ మహా గణపతయే నమః, ఓం నమః శివాయ, ఓం నమః సాయినాథాయ, అల్లాహ్ సాయి – మౌలా సాయి, ఏసు బుద్ధ మహావీర, ఐ లవ్ యు సాయిబాబా, శ్రీ గురుభ్యోనమః, సాయి నీ పాట పాడుతాను తదితర స్వరపరిచిన సంకీర్తనలను మధురంగా ఆలపించి భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తారు.

అనంతరం పద్మశ్రీ డా. శోభారాజు మాట్లాడుతూ.. 1996 నవంబర్ 19న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యహస్తాలతో తాను రచించి, సంగీతం సమకూర్చిన ఐ లవ్ యు సాయిబాబా ఆడియో విడుదల కార్యక్రమం జరిగిందని గుర్తుచేశారు. ఆ కార్యక్రమానికి ప్రముఖ నేపథ్య గాయని పి. సుశీల, సంగీత దిగ్గజం ఎం.ఎస్. సుబ్బులక్ష్మి కూడా హాజరుకావడం తన జీవితంలో మరచిపోలేని గొప్ప అనుభూతిగా నిలిచిందని భక్తులకు వివరించారు. ఆ ఆడియో విడుదల కార్యక్రమానికి మూడు దశాబ్దాలు పూర్తయ్యాయని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. సాయి నామస్మరణ, సంకీర్తనలతో అన్నమయ్యపురంలో జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో సాగాయి.






