మాదాపూర్‌లో 18వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో ప్రారంభం

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (IPEMA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 18వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో-2026 ప్రారంభమైంది. నవంబర్ 25, 26, 27 తేదీల్లో మూడు రోజులపాటు జరగనున్న ఈ ఎక్స్‌పో ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వాకిటి శ్రీహరి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, IPEMA అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్‌లతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పోను మాదాపూర్‌లో నిర్వహించడం ఎంతో సంతోషకరమని అన్నారు. పౌల్ట్రీ రంగానికి ఈ ప్రదర్శన చక్కటి వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. పౌల్ట్రీ పరిశ్రమ రైతులకు, రైతు కూలీలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మేలు చేస్తోందని గాంధీ ప్రశంసించారు. రైతులు పండించే మొక్కజొన్న, సోయా వంటి పంటలతో పాటు నూకలు, తౌడు తదితర ఉప ఉత్పత్తులను పౌల్ట్రీ పరిశ్రమ కొనుగోలు చేస్తూ వ్యవసాయ రంగానికి అండగా నిలుస్తోందని తెలిపారు. గుడ్లు, కోళ్ల పెంపకం ద్వారా రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు యువతకు అవసరమైన ప్రొటీన్లను అందించడంలో ఈ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజూ సుమారు 5.30 కోట్ల గుడ్ల ఉత్పత్తి జరుగుతోందని, తద్వారా ప్రజలకు పోషకాహారం అందుబాటులోకి వస్తోందని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో వారానికి మూడు గుడ్లతో పాటు చికెన్‌ను కూడా భోజనంలో అందిస్తూ విద్యార్థులకు పౌష్టికాహారం కల్పించడంలో పౌల్ట్రీ పరిశ్రమ సహకారం ఎంతో కీలకమని ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here