నమస్తే శేరిలింగంపల్లి : ప్రధాన రహదారులతో పాటు కాలనీలలో అంతర్గత రహదారులు పరిశుభ్రతకు నెలవుగా నిలవాలని శేరిలింగంపల్లి జోనల్ కమీషనర్ ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితుల నుంచి ముక్కున వేలేసుకునేంత శుభ్రంగా అందంగా రహదారులను తీర్చిదిద్దాలని ఇందుకు క్షేత్రస్థాయిలో చేపట్టే పారిశుద్ధ్య చర్యలే అత్యంత ప్రధానమన్నారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలో జడ్సీ ఉపేందర్‌రెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈసందర్భంగా గచ్చిబౌలిలోని ప్రధాన రహదారిపై మూడు కిలో మీటర్ల మేర నడకతో పరిశుభ్రత చర్యలను పరిశీలించారు. అనంతరం శిల్పా లే అవుట్ ఫ్లె ఓవర్‌పై పారిశుద్ధ్య పనులతో పాటు గచ్చిబౌలి, బయో డైవర్సిటీ కూడళ్లను జడ్సీ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీ పరిశ్రమలకు శేరిలింగంపల్లి జోన్ వేదికగా ఉన్నందున ఆ స్థాయిలోనే రహదారుల నిర్వహణ జరగాలని, క్షేత్రస్థాయి సిబ్బంది చేపట్టే చర్యలే ఇందుకు ప్రధానమన్నారు. స్వీపింగ్ అనంతరం వెంటనే చెత్త కుప్పలు తొలగించాలని, ఫ్లె ఓవర్‌లపై మట్టి ఇసుక ఇతర వ్యర్థాలు లేకుండా పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని జడ్సీ ఆదేశించారు. డీసీ స్థాయి నుంచి కింది స్థాయి వరకు అధికారులు క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య పనులను పకడ్బందీగా పర్యవేక్షించాలని, లోటు పాట్లను సవరించుకుంటూ చక్కని పరిసరాలు నెలకొనేలా చూడాలన్నారు. ఆయన వెంట డీసీ రజనీకాంత్‌రెడ్డి, వైద్యాధికారి డాక్టర్ నగేష్ ఉన్నారు.
రహదారులపై నీరు నిల్వ ఉండకుండ చర్యలు చేపట్టండి
శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని రహదారులపై ఎక్కడా వర్షపు వరద నీరు నిల్వ ఉండకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని జోనల్ కమీషనర్ ఉపేందర్‌రెడ్డి ఆదేశించారు. ఆయా విభాగాల అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. ఇంజినీరింగ్, బయో డైవర్సిటీ అధికారులతో శుక్రవారం మద్యాహ్నం జోనల్ కార్యాలయంలో జడ్సీ సమీక్ష సమావేశం నిర్వహించారు. రహదారులపై నీరుఉ నిలిచే ప్రాంతాలతో పాటు ట్రాఫిక్‌కు ఆటంకంగా ఉండేలా రహదారులపై ఏర్పడ్డ గుంతలు, పాదచారుల ఫుట్ పాత్‌లు, సెంట్రల్ మీడియంపై పచ్చదనం అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జడ్సీ మాట్లాడుతూ రహదారులపై పాత్ హోల్స్‌ను ఎప్పటికపుడు పూడ్చి వేయాలని, వరద నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇలాంటి వాటికి పూర్తిగా సదరు అధికారులే బాధ్యులన్నారు. ప్రధాన రహదారులతో పాటు సెంట్రల్ మీడియంలో పచ్చదనం, కూడళ్లలో చెట్ల పరిరక్షణను పకడ్బందీగా చేపట్టాలని, పచ్చదనం మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని జడ్సీ ఉపేందర్‌రెడ్డి తెలిపారు .
పలు ప్రాంతాలలో ఫుట్ పాత్‌లు కొంత మేర దెబ్బతిన్నాయని, ఫలితంగా నడకకు అసౌకర్యం కలుగుతున్నందున తక్షణ మరమ్మతులు చేయాలని అధికారులకు సూచించారు . స్వచ్ఛ పరిసరాలు ఆహ్లాదకరమైన పచ్చదనం కోసం రాజీలేకుండా కృషి చేయాలని జడ్సీ ఉపేందర్‌రెడ్డి స్పష్టం చేసారు. చెరువుల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, ఎటువంటి వ్యర్థాలు వేయకుండా కట్టడి చేయాలని, దోమల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ శంకర్, ఈఈలు, డీఈలు, బయో డైవర్సిటీ విభాగం అధికారులు పాల్గొన్నారు.