శేరిలింగంపల్లిలో వన్నె తరగని గులాబి జెండా..!

  • ఫలించిన గాంధీ వ్యూహాలు, కలిసొచ్చిన అభ్యర్థుల బలాలు

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం 2016 లో జరిగిన తొలి జిహెచ్ఎంసి ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పది డివిజన్ల లో టిఆర్ఎస్ విజయ బావుటా ఎగురవేసింది. అప్పటి ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థులు, టిడిపి బిజెపి కూటమి, కాంగ్రెస్ పార్టీలతో పోటీ పడి ఊహించని రీతిలో విజయం సాధించారు. ఐదేళ్లు గడచిపోయాయి, నాయకులు మారుతూ వచ్చారు. నియోజకవర్గ ముఖ్య నేతల పార్టీ ఫిరాయింపులు, అధికార పార్టీ పై ప్రజల్లో కొంత అసహనం, రాజకీయంగా బలపడిన బీజేపీ తదితర అంశాలు వెరసి శేరిలింగంపల్లి రాజకీయ ముఖ చిత్రమే మారిపోయింది. ప్రస్తుత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నగరమంతా కాషాయ హోరు వినబడినప్పటికీ, శేరిలింగంపల్లిలో మాత్రం కారుదే జోరు కొనసాగింది. గచ్చిబౌలి మినహా మిగతా తొమ్మిది డివిజన్లలో గులాబీ గుబాళింపు మరింతగా పెరిగింది. గత జిహెచ్ఎంసి ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికల్లో ఓట్ల శాతం కేవలం 4.64 మాత్రమే తగ్గడం గమనార్హం.

కుటుంబ సభ్యులతో సహా గాంధీ..

జిహెచ్ఎంసి ఎన్నికల విజయం వెనుక ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ పాత్ర ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. ఎన్నికల ప్రచారంలో ఆయన అనుసరించిన వ్యూహాలు, కొత్త అభ్యర్థుల ఎంపికలో తీసుకున్న నిర్ణయాలు పార్టీ విజయానికి ఎంతగానో దోహదం చేశాయి. ప్రతీ డివిజన్ లో గాంధీ సతీమణి శ్యామల దేవితో పాటు కుటుంబసభ్యులు ప్రచారం నిర్వహించడం కొసమెరుపు. సిట్టింగ్ కార్పొరేటర్ లను కాదని మూడు డివిజన్ లలో అభ్యర్థులను మార్పు చేయడంలో గాంధీ సాహసోపేత నిర్ణయమే తీసుకున్నారని చెప్పవచ్చు. హైదర్ నగర్ డివిజన్ లో నార్నెశ్రీనివాస్, చందానగర్ డివిజన్ నుండి మంజుల రఘునాథ్ రెడ్డి, వివేకానందనగర్ డివిజన్ లో మాధవరం రోజా రంగారావులకు టికెట్ కేటాయించడంతో పాటు వారి వెంట ఉండి గెలిపించే బాధ్యత భుజాన వేసుకున్నాడు గాంధీ.

ఇక మియాపూర్ డివిజన్ లో తన అనుచరుడైన ఉప్పలపాటి శ్రీకాంత్ కు అవకాశం ఇచ్చి, డివిజన్ పై ప్రత్యేకంగా దృష్టి సారించి పక్కా ప్రణాళికతో ప్రత్యర్థులను మట్టికరిపించడంలో కీలక పాత్ర పోషించాడు. పార్టీ నుండి టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను అతి తక్కువ సమయంలోనే సముదాయించి పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా నిలిచేలా చేయడంలో గాంధీ చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇచ్చాయి. మిగతా డివిజన్లలో సైతం అభ్యర్థులకు అందుబాటులో ఉంటూ, ఆయా డివిజన్ల ఎన్నికల ఇంఛార్జులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నియోజకవర్గంలో మరోసారి టిఆర్ఎస్ పార్టీ గెలుపుకు విశేషంగా కృషి చేశాడు.

పార్టీ బలానికి సొంత చరిష్మా తోడై అద్భుత ఫలితాలు…!

ఓ వైపు అధికార పార్టీ అండదండలు మరోవైపు రెండు డివిజన్లో సొంత ఇమేజ్ తోడైతే ఎన్నికల ఫలితాల్లో అద్భుతాలు సాధించవచ్చని మరోసారి నిరూపించాడు జగదీశ్వర్ గౌడ్. తాను పోటీ చేసిన మాదాపూర్ డివిజన్ తో పాటు, ఆయన సతీమణి పోటీ చేసిన హఫీజ్ పేట్ డివిజన్ లోనూ విజయం సాధించడమే కాకుండా నియోజకవర్గంలోనే అత్యంత మెజారిటీ సాధించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఈ విజయంతో జగదీశ్వర్ గౌడ్ హఫీజ్ పేట్, మాదాపూర్ డివిజన్ లను తన కంచుకోటగా మలచుకున్నాడని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నిస్వార్థంగా సేవలందించే నాయకులకు ప్రజలు ఎల్లప్పుడూ బ్రహ్మరథం పడుతారని జగదీశ్వర్ గౌడ్ విషయంలో మరోసారి తేటతెల్లమైంది.

నియోజకవర్గంలో మాస్ మహారాజుల జయకేతనం

ఏ ప్రాంతంలో అయినా మాస్ ఓటర్ల మనసు గెలిచిన నాయకుడికి ఏ ఎన్నికల్లో అయినా తిరుగు ఉండదు అని నిరూపించారు రాగం నాగేందర్ యాదవ్, హమీద్ పటేల్, దొడ్ల వెంకటేష్ గౌడ్ లు. శేరిలింగంపల్లి, కొండాపూర్, ఆల్విన్ కాలనీ డివిజన్లలో మరోసారి విజయ ఢంకా మోగించిన ఈ ముగ్గురు నాయకులు వారి వారి డివిజన్ లలో మాస్ ఓటర్ల నాడి పట్టడంలో సక్సెస్ అయ్యారు. ఎన్నికల్లో ప్రత్యర్థులు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ బస్తీ ప్రజల మద్దతుతో గెలిచిన వీరు నియోజకవర్గ మాస్ మహారాజులుగా తమ సత్తా చాటారు.

Advertisement

2 COMMENTS

  1. 4.64 శాతం మాత్రమే తగ్గింది. గ్రేటర్ మొత్తంగా పోల్చితే ఈ తరుగుదల చాల స్వల్పం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here