- జోన్‌లో పలు ప్రాంతాలలో విస్తృత పర్యటన
నమస్తే శేరిలింగంపల్లి : వర్షాకాలం నేపథ్యంలో జోన్ వ్యాప్తంగా ఎక్కడా ముంపు సమస్యలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని శేరిలింగంపల్లి జడ్సీ ఉపేందర్‌రెడ్డి ఆదేశించారు. ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పని చేయటం వల్ల ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి జడ్సీగా బాధ్యతలు స్వీకరించిన ఉపేందర్‌రెడ్డి ఇంజినీరింగ్, బయోడైవర్సిటీ, సానిటేషన్, విద్యుత్ విభాగాల అధికారులతో కలిసి శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని నెక్టార్ గార్డెన్, త్రిషూల్ గ్రాండ్, బయో డైవర్సిటీ, నెక్టార్ గార్డెన్, లింగంపల్లి ఆర్‌యూబీ , బయో డైవర్సిటీ కూడలి ప్రాంతాలలో గురువారం ఉదయం విస్తృత పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా వర్షాలకు నీరు నిలిచే ప్రాంతాలను, అక్కడ చేపడుతున్న బాక్స్ డైన్లు సహా ఇతర నిర్మాణాలను జడ్సీ పరిశీలించారు.
అనంతరం జడ్సీ ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ వర్షాకాలం పూర్తయ్యే వరకు సంబంధిత విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, వాహనాల రాకపోకలకు ఏమాత్రం ఆటంకం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. నాలాల్లో డీసిల్టింగ్ చేపట్టడంతో పాటు మ్యాన్ హోళ్లు నాలా వంతెనల వద్ద ప్రమాదాలకు ఆస్కారం లేకుండా పటిష్టమైన జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. వరద నీటి ప్రవాహానికి ఆటంకంగా ఉన్న ఆక్రమణలను తొలగించాలని, విద్యుత్ స్తంబాలను షిఫ్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు.
వరద మళ్లింపు నిర్మాణ బాక్స్ డైన్లు , ఇతర నిర్మాణ పనులను పూర్తి చేయటంలో జాప్యం చేయవద్దని జడ్సీ ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఈదురు గాలులు సహా ఇరత కారణాలతో రహదారులపై పడే చెట్లను, ఇతర గ్రీన్ వేస్ట్‍ను వెంటనే తొలగించాలని స్పష్టం చేసారు. జడ్సీ వెంట డీసీ రజనీకాంత్‌రెడ్డి, ఎస్ఈ శంకర్ , ఈఈ శ్రీనివాస్, పట్టణ ప్రణాళిక ఏసీపీ మెహ్రా, వైద్యాధికారి డాక్టర్ నగేష్ నాయక్ , డీఈ, ఏఈ , ఇతర అధికారులున్నారు.