నమస్తే శేరిలింగంపల్లి: ఖరీదైన ద్విచక్రవాహనాలను నడపాలనే కోరికతో పాటు మద్యానికి అలవాటు పడ్డ ఓ యువకుడు అడ్డదారులు తొక్కాడు. చివరికి పోలీసుల చేతికి చిక్కి కటకటాల పాలైన సంఘటన మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సోమవారం మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎసిపి కృష్ణ ప్రసాద్ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. తూ.గో జిల్లా రామచంద్రాపురం ప్రాంతానికి చెందిన కటకం శివకుమార్ అలియాస్ శివ (19) 8వ తరగతి చదువుకున్నాడు. 2018 నగరానికి వలస వచ్చి కెపిహెచ్‌బి కాలనీలోని ఓ హోటల్‌లో పార్సిల్ బాయ్‌గా పనిచేస్తూ అక్కడే ఉండసాగాడు. ఈ క్రమంలో మద్యానికి అలవాటు పడటంతో పాటు ద్విచక్రవాహనాలు నడపాలనే కోరికతో బైకులు దొంగలించడం మొదలు పెట్టాడు. 2020, 21 సంవత్సారలలో కెపిహెచ్‌బి కాలనీ, మియాపూర్, జగద్గిరి గుట్ట, గోల్కొండ, గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో నకిలీ తాళంచెవి ఉపయోగించి 10 ద్విచక్ర వాహనాలను దొంగిలించాడు. కేసును సీరియస్‌గా తీసుకున్న మియాపూర్ పోలీసులు ఇన్‌స్పెక్టర్ వెంకటేష్ సామల, డిఐ మహేష్‌గౌడ్ ల పర్యవేక్షణలో ఎస్సై రవికిరణ్, పోలీసు సిబ్బంది దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి రూ.5లక్షల విలువ చేసే 10 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.