శేరిలింగంపల్లి, నవంబర్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని కొండాపూర్ డివిజన్ శ్రీరాం నగర్ సి బ్లాక్ కాలనీలో హాస్టల్స్, ఓయో రూమ్స్ ఏర్పాటును నిరసిస్తూ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీలో ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా కాలనీ అధ్యక్షుడు దిండి లక్షయ్య మాట్లాడుతూ కమర్షియల్ హాస్టల్స్ ఏర్పాటు వల్ల కాలనీలో నివాసం ఉండే సాధారణ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపించారు. తాగడానికి నీరు సరిపోవడం లేదని, డ్రైనేజి సమస్య ఏర్పడుతుందని అన్నారు. హాస్టల్స్ లో ఉండే వారు రాత్రిళ్లు మద్యం తాగి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, గొడవలు, దొంగ తనాలు జరుగుతున్నాయని, మత్తు పదార్థాలకు అలవాటు పడి కాలనీలో ఇబ్బందులు సృష్టిస్తున్నారని అన్నారు.
ట్రాఫిక్ సమస్యతోపాటు పార్కింగ్ సౌకర్యాలు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. హాస్టల్స్ ఏర్పాటుకు కాలనీ వాసులు తమ ఇండ్లను హాస్టల్స్ కు ఇవ్వొద్దని కాలనీ వాసులకు విజ్ఞప్తి చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి సి బ్లాక్ అసోసియేషన్ సభ్యులు కూడా పూర్తి మద్దతునిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాలనీ ఉపాధ్యక్షుడు ఈశ్వర్ గౌడ్, జనరల్ సెక్రటరీ రాజేందర్ గుప్త, ట్రెజరర్ భూపాల్ రెడ్డి, శ్రీరామ్ నగర్ ఏ బ్లాక్ అధ్యక్షుడు శివ, నర్సింహా చారి, జైపాల్ రెడ్డి, సంజీవ రెడ్డి, జియావుద్దీన్, నబీ, వంశీ, గోపాల కృష్ణ, రాము కాలనీ వాసులు పాల్గొన్నారు.