శేరిలింగంపల్లి, అక్టోబర్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెద్దాపురం మండలం చదలడ గ్రామానికి చెందిన మోతుకూరి వీరబాబు (40) గత 10 ఏళ్ల కిందట బతుకు దెరువు నిమిత్తం నగరానికి వలస వచ్చి శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మదీనాగూడ దీప్తిశ్రీనగర్‌లో నివాసం ఉంటూ స్థానికంగా వాచ్‌మన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
ఇతనికి భార్య మోతుకూరి సుబ్బలక్ష్మి, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కాగా శుక్రవారం అర్థరాత్రి సమయంలో చందానగర్‌లోని పీజేఆర్ ఎన్క్లేవ్ వద్ద ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి వద్ద మియాపూర్ నుంచి వస్తున్న ఓ గుర్తు తెలియని వాహనం వీరబాబును ఢీకొట్టింది. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. తీవ్రగాయాల పాలైన వీరబాబు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు వీరబాబు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి, అతని భార్య సుబ్బలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.