అద్భుతం కాదు.. స‌హ‌జ‌మే… సూర్యుని చుట్టూ వ‌లయం ఎందుకు ఏర్ప‌డుతుంది..?

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: అనంతమైన విశ్వంలో ఎన్నో అద్భుతాలు.. మ‌రెన్నో అంతు చిక్క‌ని విష‌యాలు. అప్పుడ‌ప్పుడూ కొన్ని సంఘ‌ట‌న‌లు మాత్ర‌మే మ‌న కంటికి క‌నిపించి ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంటాయి. కొన్ని సంఘ‌ట‌న‌లు స‌హ‌జంగానే జ‌రుగుతున్న‌ప్ప‌టికీ వాటి వెన‌క గ‌ల కార‌ణాలు మ‌న‌కు తెలియ‌క‌పోవ‌డంతో అద్భుత సంఘ‌ట‌న‌లుగా భావిస్తూ ఉంటాం. ఈ త‌ర‌హాలోనిదే సూర్యుని, చంద్రుని చుట్టూ ఏర్ప‌డే వ‌ల‌యాలు.

జూన్ 2వ తేదీ బుధ‌వారం ఉద‌యం 11 గం.ల నుండి సూర్యుని చుట్టూ రంగురంగుల గుండ్ర‌ని వ‌ల‌యం ఏర్ప‌డి చూప‌రుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. ఎంతోమంది త‌మ సెల్‌ఫోన్‌లలో సూర్యుని చిత్రాల‌ను బందించి సామాజిక మాధ్య‌మాల‌లో పోస్ట్ చేయ‌డంతో వైర‌ల్‌గా మారాయి. ఈ వ‌ల‌యాల‌ను స‌న్ హాలో, 22 డిగ్రీ హాలోస్ అని పిలుస్తారు. వాతావ‌ర‌ణంలో 20వేల అంత‌కంటే ఎక్కువ ఎత్తులో మంచు స్ప‌టికాల‌తో కూడిన మేఘాలు ఉండ‌టం కార‌ణంగా ఇటువంటి వ‌ల‌యాలు ఏర్ప‌డుతుంటాయి. సూర్యుని కాంతి ష‌ట్కోణ ఆకారంలో గ‌ల ఈ మంచు స్ప‌టికాల‌పై ప‌డి వ‌క్రీభ‌వనం చెందిన‌పుడు రంగురంగుల‌తో కూడిన వ‌ల‌యాలు ఏర్ప‌డుతాయి.

ఇవి సూర్యుని నుండి 22 డిగ్రీల కోణంలో ఉండ‌టం కార‌ణంగా వీటిని 22 డిగ్రీ హాలోస్ అని పిలుస్తారు. కొన్ని సమయాల్లో ఇది 46 డిగ్రీల వ్యత్యాసాన్ని కలిగి ఉన్న‌ప్పుడు మరో రకమైన ఇంద్రధనస్సులా కనిపిస్తుంది. అప్పుడ‌ప్పుడూ ఇటువంటి వ‌ల‌యాల‌ను చంద్రుని చుట్టూ కూడా గ‌మ‌నించవ‌చ్చు. ఇటువంటి హాలో వ‌ల‌యాలు మేఘావృత‌మైన ప్రాంతాల్లో భూ ఉప‌రిత‌లం నుండి దాదాపు 20 వేల మీట‌ర్ల ఎత్తులో మాత్ర‌మే ఏర్ప‌డ‌తాయి. సూర్యునికి ద‌గ్గ‌ర‌గా ఉన్న‌ట్లు క‌నిపించిన‌ప్ప‌టికీ అది కేవ‌లం మ‌న ఒకేసారి భూమిపై అన్ని ప్రాంతాల నుండి చూడ‌టం అసాధ్యం.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here