- రోగ నిరోధక శక్తి తక్కువ ఉండే చిన్నారులకు మిక్కిలి ప్రమాదం అంటున్న వైద్యులు…
నమస్తే శేరిలింగంపల్లి: మెడికవర్ హాస్పిటల్స్ బృందం కరోనా మూడవ వేవ్ గురించిన సంక్షిప్త సమాచారంతో రూపొందించిన బుక్‌లెట్‌ను బుదవారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సజ్జనార్ విడుదల చేసారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ మూడవ వేవ్ లో కరోనా ఎలాంటి వ్యక్తులపైనా ప్రభావం చూపుతుంది, పిల్లలను కోవిడ్ బారిన పడకుండా ఎలా రక్షించుకోవాలి, ఒకవేళ కరోనా వస్తే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే అన్ని రకాల అంశాలను క్లుప్తంగా ఈ బుక్లెట్ లో పొందుపరచడం అభినందనీయం అన్నారు. మూడవ వేవ్‌లో అత్యధికంగా చిన్న పిల్లలు కరోనా బారిన పడే అవకాశం ఎక్కువని, అన్ని సర్వేలు తెలుపుతున్న నేపథ్యంలో అందరు అత్యంత జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. మెడికవర్ హాస్పిటల్స్ సీనియర్ పిడియాట్రిక్ ఆండ్ నియోనాటాలజిస్ట్ డాక్టర్ రవిందర్‌రెడ్డి పరిగె మాట్లాడుతూ ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న పిల్లలలో కోవిడ్ మూడవ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అన్నారు. పిల్లల కు పౌష్టికాహారం అందించడం ద్వారా వారికి రోగనిరోధకశక్తి పెరిగి ఎటువంటి వ్యాధుల బారిన పడకుండా చూడాలని వైద్యుల సలహా అన్నారు. మూడవ వేవ్ పొంచి ఉన్న నేపథ్యంలో పిల్లలు అన్నిరకాల వైద్య సేవలనందించడానికి మెడికవర్ హాస్పిటల్స్ పీడియాట్రిక్ అండ్ నియోనాటాలజీ విభాగం పూర్తి సన్నద్ధంగా ఉందన్నారు. అన్నిరకాల ఎమర్జెన్సీ, నాన్ ఎమర్జెన్సీ సేవలని అందుబాటులో ఉంచుతున్నామని, ఈ తరుణంలో మా మెడికల్, నర్సింగ్, విద్య సిబ్బంది పూర్తి నిబద్దతతో వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ బుక్లెట్‌ను మెడికవర్ హాస్పిటల్స్ వెబ్సైటు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని, ఇతర వివరాలకు www.medicoverhospitals.inకు లాగిన్ అవ్వలాని సూచించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ, ఎస్‌సీఎస్‌సీ సెక్రటరీ కృష్ణ ఏదుల, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శరత్ రెడ్డి, మెడికవర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరికృష్ణ , చీఫ్ బిజినెస్ ఆపరేషన్స్ మహేష్ దెగ్లూర్కర్ పాల్గొన్నారు.