హిందువులందరూ ప్రముఖ పుణ్య క్షేత్రాలను దర్శించినప్పుడు దేవాలయ ప్రాంగణంలో లభ్యమయ్యే రకరకాల పవిత్రమైన దారాలను భక్తిభావనతో ధరిస్తూ ఉంటారు. చేతికి నలుపు, పసుపు, ఎరుపు, కాషాయం రంగులో ఉండే దారాలను, మెడలో లాకెట్లు, దేవుని ప్రతిమలతో కూడిన దారాలను, తాయెత్తులను, కాలికి నలుపు రంగు దారాలను ధరించడం సాంప్రదాయంగా మారింది. వీటిని ధరించడం వల్ల శుభం కలుగుతుందని, చేసే పనుల్లో భగవంతుని కృపతో విజయం సాధిస్తారని గట్టి నమ్మకం.
ఈ దారాలను పవిత్రంగా భావించడం కారణంగా అవి శిథిలమయ్యాక ఎక్కడ పారేయ్యాలో తెలియక అయోమయానికి గురవుతుంటారు. కొందరు దేవాలయాలను దర్శించే సమయంలోనే క్యూ లైన్లలో వెళ్లేటప్పుడు అక్కడ ఉండే ఇనుప కంచెలకు, క్యూలైన్ల రాడ్‌లకు కట్టేస్తుంటారు. విచిత్రమేమిటంటే అలా ఎందుకు కటడతారో తెలియకుండానే ఇతరులను అనుసరించి పాత దారాలను, శిథిలమైన దండలను కట్టేస్తుంటారు. మరికొంత మంది ఉపయోగించిన గాజులు, ఇతర వస్తువులను కూడా కట్టడం గమనిస్తూ ఉంటాం. ఇలాంటి అజ్ఞానంతో కూడిన పనులు చేస్తూ భగవంతుని కృపకు బదులు పాపాన్ని మూటగట్టుకుంటామనే విషయం చాలామంది భక్తులకు తెలియకపోవడం విచారకరం.
దేవాలయాలు పవిత్రతకు, ప్రశాంతతకు నిలయాలు. మనసులో ఎన్ని ఆలోచనలు, బాధలు ఉన్నా ఒకసారి దేవాలయంలో అడుగుపెట్టగానే అక్కడి వాతావరణంతో మనసు పులకరించి మనకు తెలియకుండానే తన్మయత్వంలో మునిగిపోతాము. అటువంటిది ఎంతో మహత్యం ఉండే పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఎంతటి శక్తివంతమైనవో అర్థం చేసుకోవచ్చు. దేవాలయాలు, పుణ్యక్షేత్రాల్లో ఉండే ఆధ్యాత్మిక నిలయాల పవిత్రతను కాపాడటం భక్తుల ప్రథమ కర్తవ్యం. అటువంటి ప్రదేశాల్లో మనం ఉపయోగించి శిథిలమైన దారాలను కట్టడం వల్ల అపరిశుభ్ర వాతావరణం ఏర్పడుతుంది. సాధారణంగా దేవాలయాల్లో మొక్కులు కట్టినట్లుగా భావించి ఇతరులను అనుసరిస్తూ తెలియకుండానే చాలామంది భక్తులు ఇటువంటి పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఫలితంగ భక్తి భావంతో ఉండాల్సిన ప్రదేశమంతా అపరిశుభ్రంగా చిరాకు కలిగించే విధంగా మారుతుంటుంది.
సాధ్యమైనంత వరకూ చేతి దారాలు, జంధ్యాలు, మెడలో ధరించే దండలను పుణ్యక్షేత్రాల్లోని ప్రవహించే నదుల్లో పారేయడం ఉత్తమం. అలా కుదరకపోతే మనుషులు తిరగని ప్రదేశాల్లో వేయాలి. దేవాలయాల్లో ఇటువంటి దారాలను కట్టడమంటే మన ఇంటి పూజ గదిలో మైలపడిన దుస్తువులు, వస్తువులను ఉంచడం వంటిదే. అందుకే సాధ్యమైనంత వరకూ దేవాలయాలను, పుణ్య క్షేత్రాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రయత్నించాలి.
ఈ ఆర్టికల్‌ను చదివినందుకు ధన్యవాదాలు.. ఇతరులకూ షేర్ చేసి పొరపాట్లు చేయకుండా అవగాహన కల్పించండి.