- సంబంధిత ఆధారాలను కోర్టులో సమర్పించాలని సంబంధిత రంగారెడ్డి జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ కు సమాచారం
నమస్తే శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి మియాపూర్ మండలంలో రంగారెడ్డి జిల్లా సర్వే నెం. 100 & 101 లోని దాదాపు 445 ఎకరాల ప్రభుత్వభూమి కబ్జా కోరుల చేతుల్లో చిక్కుకున్నది. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలను భేఖాతరు చేస్తూ కొంత మంది వ్యక్తులు సదరు స్థలాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దురాక్రమణకు పాల్పడ్డారని జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, నాగం రాజశేఖర్ ప్రధాన కార్యదర్శి ఆరోపించారు. రెవెన్యూ చట్టం, నియమ, నిబంధనలను తుంగలో తొక్కి , ఎటువంటి అనుమతులు పొందకుండా సదరు భూమిని విభజించి రిజిస్ట్రేషన్లు చేసినట్లుగా తెలుస్తుందని విలేకరుల సమావేశంలో తెలిపారు. నగరం నడిబొడ్డున ఉన్న విశాలమైన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకోవడం చాలా తీవ్రమైన విషయంగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్నారు.
సంబంధిత రంగారెడ్డి జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్, రాజేంద్రనగర్ డివిజన్ 3 రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, హెచ్ఎండీఏ కమిషనర్, శేరిలింగంపల్లి జోన్ జీహచ్ఎంసీ జోనల్ కమిషనర్లు సంబంధిత ఆధారాలు, నివేదికలతో కోర్టు ఎదుట హాజరు కావాలని, హాజరు కాకపోతే కోర్టు ధిక్కరణ కింద ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసికెళ్ళ వలసి వస్తుందని తెలిపారు. అంతేకాక మియాపూర్ సర్వే నెం 100 & 101 లో ఉన్న ప్రభుత్వ భూమిని నిషేధిత జాబితాలో చేర్చి, రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ చట్టం, సెక్షన్ 22-A ప్రకారము సబ్ రిజిష్ట్రార్ ఆఫీస్ లో ఇకపై ఎలాంటి రిజిస్ట్రేషన్లు జరగకుండా చూడాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ ను ఆదేశించారు. అదేవిధంగా మియాపూరీ సర్వేనెం. 100 & 101 లో సర్వే నిర్వహించి, దురాక్రమణకు గురైన వివరాలతో సర్వే రిపోర్టు ని కోర్టుకు సమర్పించ వలసినదిగా వారిని కోరారు. అలాగే ఈ కేసు వివరాలను కోర్టు లో సమర్పించేందుకు దీప్తిశ్రీనగర్ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీకి నోటీసులు ఇవ్వాలని రిజిస్ట్రీని కోర్టు ఆదేశించినట్టు జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగం రాజశేఖర్ లు తెలిపారు.