- సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్
- జాతి సేవకు పోలీసులు పునరంకితం కావాలి
- అమరవీరులకు ఘనంగా నివాళులు
నమస్తే శేరిలింగంపల్లి : పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరవీరుల సేవలను స్మరిస్తూ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్, సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ లోని అమరవీరుల స్మారక స్థూపానికి ఘనంగా నివాళులర్పించారు. ముందుగా ఆయన గౌరవ వందనాన్ని స్వీకరించి అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీసులు జాతి సేవకు పునరంకితం కావాలన్నారు. సమాజం కోసం, దేశం కోసం, రేపటి తరాల భవిష్యత్తు మంచి కోసం ప్రాణత్యాగాలు చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతీఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీసుల త్యాగాలను నిత్యం స్మరించుకోవడం అందరి బాధ్యత అన్నారు. దేశ భద్రత చూసుకునే బాధ్యత సైనికులదైతే, దేశంలోని అంతర్గత భద్రత చూసుకునే బాధ్యత పోలీసులదేనన్నారు. సమాజంలో ఎవరికి ఏ కష్టం, నష్టం, వచ్చినా ముందుగా గుర్తుకు వచ్చేది పోలీసేనని అన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ మొక్కవోని ధైర్యంతో పోలీసులు విధులు నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందారన్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెడతానని ప్రతి పోలీస్ విధుల్లో చేరినప్పుడు ప్రమాణం చేస్తారు. పోలీస్ స్టేషన్ కి వెళ్తే న్యాయం జరుగుతుందని ప్రజలు భావిస్తారు. అందుకు తగ్గట్టుగానే విధులు నిర్వర్తించి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని పొందిన వారున్నారన్నారు. ప్రజలకు పోలీస్ శాఖ పట్ల మరింత నమ్మకం కలిగే విధంగా శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల కోసం చేస్తున్న కృషి ఆమోఘమని చెప్పారు.
ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసులు ప్రజారక్షణ, శాంతి పరిరక్షణ కోసం నిరంతరం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉండి విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రజల కోసం జీవించి, మరణించే పోలీసులకి, ప్రాణాలని పణంగా పెట్టి ప్రజల కోసం పోలీసు చేసిన త్యాగానికి గౌరవం చూపించడం మనందరి బాధ్యత అన్నారు.
కొత్తగా పోలీసు బాధ్యత నిర్వర్తించడానికి ముందుకు రాబోతున్నవారికి విధి నిర్వహణలో స్ఫూర్తిని, నూతనోత్తేజాన్ని నింపడమే పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవడంలోని ప్రధాన ఉద్దేశమన్నారు. పోలీసులు విధి నిర్వహణలో క్రమశిక్షణతో పని చేయాలన్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా దాదాపు 264 పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారని జోహార్ల తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అమరుల మరణం వారి కుటుంబసభ్యులకు తీరని లోటని, చనిపోయిన పోలీసుల ఆత్మకు శాంతి కలగాలని తెలిపారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండే డిపార్ట్ మెంట్ పోలీసులు.. కాబట్టి పోలీసులకు ఎప్పుడూ సహకరించాలన్నారు. 1959 ఇండో-చైనా సరిహద్దులో చైనా దురాక్రమణను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిందన్నారు. ఈ యుద్ధంలో ఎంతో మంది సైనికులు అమరులయ్యారన్నారు. అలాగే 1959 అక్టోబర్ 21న లడఖ్ సరిహద్దులో కాపలాగా ఉన్న పది మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు చైనా సైన్యంతో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించారని తెలిపారు.
అనంతరం పోలీసు వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ పోలీస్ అమరవీరులకు రెండు నిమిషాలు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఒక్కొక్కరిగా వచ్చి అందరూ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం ఈ సంవత్సరం అమరులైన వారి పేర్లను/ రోల్ ఆఫ్ హానర్ ను సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ (సీఎస్డబ్ల్యూ) ఏసీపీ ధనలక్ష్మి చదివారు. అనంతరం విధి నిర్వహణలో ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన ఆమన్గల్ ఎస్ఐ కే హనుమంత్ రెడ్డి, తలకొండపల్లి పోలీస్ కనీస్టేబుల్ ఫహీముద్దీన్, ఆర్మేడ్ కానిస్టేబుల్ ఈశ్వర్ రావు సేవలను స్మరించుకుంటూ అమరవీరుల కుటుంబ సభ్యులను సైబరాబాద్ సీపీ శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా జాయింట్ సీపీ మాట్లాడుతూ.. భారత్-చైనా సరిహద్దుల్లోని ఆక్సయ్ చిన్ ప్రాంతంలో 16 వేల అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న వేడి నీటిబుగ్గ (హాట్ స్ప్రింగ్స్) అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా మన మధ్య నిలిచి ఉందన్నారు. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులుబాసిన పోలీసులను స్మరిస్తూ, ప్రతి ఏడాది అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ఈ పవిత్ర స్థలం నుంచే మొదలైందని, మిలటరీ ఎత్తుగడలకు చైనా సరిహద్దులోని భారత భూభాగాలైన లడఖ్, సియాచిన్ ప్రాంతాలు కీలకమైనవి. సరిహద్దు భద్రతాదళం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతాదళాలు ఏర్పడక ముందు సరిహద్దులను రక్షించే మహత్తర బాధ్యతను కేంద్ర రిజర్వు పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) బలగాలు నిర్వర్తించేవన్నారు.
1959 అక్టోబరు 21న డీఎస్పీ కరమ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్ కు చెందిన 21 మంది సభ్యుల బృందం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తుండగా, చైనా రక్షణ బలగాలు సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో సీఆర్పీఎఫ్ దళం హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో దీటుగా ఎదురొడ్డి పోరాడింది. ఆ పోరాటంలో పది మంది భారత జవాన్లు అమరులయ్యారు. ‘హాట్ స్ప్రింగ్స్’ అంటే వేడి నీటిబుగ్గ అని అర్థం అని, కానీ భారత జవాన్ల రక్తంతో తడిచిన ‘హాట్ స్ప్రింగ్స్’ నెత్తుటి బుగ్గగా మారి పవిత్ర స్థలంగా రూపు దిద్దుకుంది. ప్రతీ ఏడాదీ అన్ని రాష్ట్రాల పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి నివాళులు అర్పించడం ఆనవాయితీ అన్నారు.
ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., జాయింట్ సీపీ అవినాష్ మహంతి, ఐపీఎస్., సైబరాబాద్ ట్రాఫిక్ డిసిపి టి శ్రీనివాస్ రావు, ఐపీఎస్., మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, విమన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ కవిత, సైబర్ క్రైమ్ ఏడిసిపి రితిరాజ్, ఐపీఎస్., అడ్మిన్ డీసీపీ ఇందిర, ఏడీసీపీ రవి కుమార్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ ఎండీ రియాజ్ ఉల్ హక్, ఏడీసీపీ వెంకట్ రెడ్డి, ఎస్ఓటి ఏడిసిపి నారాయణ, ఏసీపీలు, ఇన్ స్పెక్టర్లు, పోలీస్ అధికారులు సంఘం అధ్యక్షుడు భద్రారెడ్డి, వివిధ సెక్షన్ల సిబ్బంది, పోలీస్ కుటుంబ సభ్యులు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.