గత కొద్ది నెలలుగా సందిగ్ధంలో పడ్డ వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం వెల్లడించింది. ఇదివరకే రిజిస్ట్రేషన్ జరిగిన ప్లాట్ల విషయంలో ఎల్ఆర్ఎస్ లేకున్నప్పటికీ తిరిగి రిజిస్ట్రేషన్లు చేసేందుకు అంగీకారం తెలిపింది. ఈ మేరకు రెజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ కమీషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ మంగళవారం ఉత్తర్వులు జరీ చేశారు. ఇదివరకే రిజిస్ట్రేషన్ ద్వారా ఒకరికి సంక్రమించిన ప్లాట్లను తిరిగి విక్రయించేందుకు ఎల్ఆర్ఎస్ అవసరం లేదని తెలిపారు. అయితే కొత్తగా ఏర్పాటు చేసినా లేఔట్ల విషయంలో మాత్రం ఇదివరకు విధించిన నిబంధనలే కొనసాగనున్నాయి. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన లేఔట్లలో ప్లాట్లను విక్రయించేందుకు ఎల్ఆర్ఎస్ తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపారు. దీంతో పాటు అనుమతి పొందిన లేఔట్లు, గతంలో ఎల్ఆర్ఎస్, బిఆర్ఎస్ ద్వారా క్రమబద్దీకరణ చేసిన ప్లాట్లు, భవనాల రిజిస్ట్రేషన్ల విషయంలో ఎటువంటి ఆంక్షలు ఉండవని తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ లు పైన తెలిపిన నిబంధనలను తప్పకుండ పాటించాలని ఆదేశించారు.