- ఏఐఎఫ్ డీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున
నమస్తే శేరిలింగంపల్లి: ఇటీవల పెంచిన ఇంజనీరింగ్ ఫీజులు తక్షణమే తగ్గించి, పేద విద్యార్థులకు ఉత్తమమైన విద్యాబోధన అందించేలా చర్యలు తీసుకోవాలని ఏఐఎఫ్ డీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వరంగల్ లోని ఓంకార్ భవన్ లో శుక్రవారం అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య (ఏఐఎఫ్ డీఎస్ ) తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా గడ్డం నాగార్జున మాట్లాడుతూ 159 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎఫ్ఆర్ సి సిపార్సులతో ప్రభుత్వం ఫీజులు పెంచడం సిగ్గు చేటు అన్నారు. కనీస ఫీజును 35000 నుండి 45 వేల వరకు పెంచారని దాదాపు 40 కళాశాలలో ఇంజనీరింగ్ ఫీజులు లక్ష రూపాయలు దాటిందన్నారు. కొన్ని కళాశాలలో ఫీజు 1,40,000 నుండి 2లక్షల వరకు ఉందని దీంతో పేద మధ్యతరగతి విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఇంజనీరింగ్ ఫీజులు పెంచిన ప్రభుత్వం, విద్యార్థులకు స్కాలర్ షిప్స్ ఎందుకు పెంచలేదని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజులపై ఉన్న శ్రద్ధ, ప్రభుత్వ కళాశాల సమస్యలపై లేదన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పూనుకొని పెంచిన ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ స్కాలర్షిప్ లను తక్షణమే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. లేకుంటే అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సమైక్య తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మహమ్మద్ మోసిన్, రాష్ట్ర కోశాధికారి పోతుగంటి కాశి రాష్ట్ర నాయకులు కిరణ్ నాగరాజు, గోపి పాల్గొన్నారు.